ETV Bharat / bharat

2022 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్​ సమాయత్తం!

author img

By

Published : Aug 21, 2021, 7:15 AM IST

Updated : Aug 21, 2021, 7:24 AM IST

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు(Assembly election 2022) పార్టీని సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్​(congress party) చర్యలు చేపట్టింది. కొన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా, మిగతా వాటిల్లో ప్రతిపక్షాలతో కలిసి భాజపాను ఓడించే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందుకోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అది పాత, కొత్త తరం నాయకుల సంగమంతో ఉంటుందని ఓ సీనియర్​ నాయకుడు చెప్పారు. ప్రియాంక గాంధీ మరింత విస్తృతమైన బాధ్యతలు చేపట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు

Congress party
కాంగ్రెస్​ పార్టీ

కాంగ్రెస్‌ పార్టీ​(congress party) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్తబ్దత నుంచి బయటపడి క్రియాశీలమయ్యారు. పార్టీలో పెద్ద మార్పులు తీసుకొచ్చే దిశగా ఆమె ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. కాంగ్రెస్‌కు(Congress) ఇప్పుడప్పుడే పూర్తి స్థాయి కొత్త అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునే సూచనలు లేనప్పటికీ, వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు(Assembly election 2022) పార్టీని సమాయత్తం చేసే కృషి మొదలైంది. 2022లో ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా, గుజరాత్‌ల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ రాష్ట్రాలు కొన్నింటిలో ఒంటరిగా, మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలతో కలసి భారతీయ జనతా పార్టీని ఓడించే లక్ష్యంతో పావులు కదుపుతోంది. పాత, కొత్త తరం నాయకుల సంగమంతో విజయం సాధించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వంటి యువ నాయకులకు కీలక పదవులు ఇవ్వడం, పాత నేతలైన గులాం నబీ ఆజాద్‌ (జమ్ముకశ్మీర్‌), రమేశ్‌ చెన్నితల (కేరళ) వంటివారి అనుభవాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం ఇందులో భాగం. త్వరలో కనీసం ముగ్గురు కొత్త ప్రధాన కార్యదర్శులను నియమించే అవకాశం ఉంది. ఈ నియామకాలు యువ నేతలు, అనుభవజ్ఞుల కలయికగా ఉంటాయని ఓ సీనియర్‌ నాయకుడు చెప్పారు. ప్రియాంక గాంధీ మరింత విస్తృతమైన బాధ్యతలు చేపట్టాలని కార్యకర్తలు కోరుకొంటున్నారు.

పార్టీలోకి ప్రశాంత్‌ కిశోర్‌

కాంగ్రెస్‌ను బలోపేతం చేసే కృషిలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. మే 2 నాటి బెంగాల్‌ గెలుపు తరువాత ఆయన జులై 13న రాహుల్‌, ప్రియాంకలతో సమావేశమయ్యారు. సోనియా గాంధీ కూడా వర్చువల్‌గా వీరి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పాలక కుటుంబం ప్రశాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నా, ఆయన అలాంటిదేమీ లేదంటున్నారు.

ఉత్తర, పశ్చిమ నాయకుల అసంతృప్తి

పదవుల్లో తమకు ప్రాధాన్యం లభించడం లేదని ఉత్తర, పశ్చిమ భారత నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభలో పార్టీ విప్‌గా కర్ణాటకకు చెందిన నసీర్‌ హుస్సేన్‌ను నియమించడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే అదే రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో పార్టీ నేతగా, జైరాం రమేష్‌ ఉపనేతగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ అదే రాష్ట్రం వ్యక్తికి పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ విషయానికి వస్తే పార్టీ నేతగా అధీర్‌ రంజన్‌ చౌధరి (బంగాల్‌), ఉపనేతగా గౌరవ్‌ గొగొయి (అసోం), చీఫ్‌ విప్‌గా కె.సురేష్‌ (కేరళ), విప్‌గా మాణికం ఠాగోర్‌ (తమిళనాడు) ఉన్నారు. కీలకమైన పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా కె.సి.వేణుగోపాల్‌, ప్రధాన సలహాదారుగా పి.చిదంబరం (తమిళనాడు) వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'మన లక్ష్యం 2024- కలిసి ముందుకు సాగుదాం!'

Last Updated : Aug 21, 2021, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.