ETV Bharat / bharat

ఘర్షణల మధ్య మధ్యప్రదేశ్ పోలింగ్- ఓటింగ్ శాతం ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 7:02 AM IST

Updated : Nov 17, 2023, 11:05 PM IST

Madhya Pradesh election 2023 polling live updates today
Madhya Pradesh election 2023 polling live updates today

17:57 November 17

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనల మధ్య ముగిశాయి. 230 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 5 గంటల వరకు 74.31 శాతం పోలింగ్​ పోలింగ్ నమోదైంది.

రాజ్​నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగగా.. హస్తం పార్టీకి చెందిన ఓ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని సల్మాన్​గా గుర్తించినట్లు ఛతర్​పుర్ ఎస్​పీ అమిత్ సంఘీ తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ వాగ్బాణాలు సంధించుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఘర్షణలు జరిగాయి. ఇందౌర్ జిల్లా​లోని మహూ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. ఈ ఘనటలో ఐదుగురికి గాయాలయ్యాయి.

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దిమనీ నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. సమస్యాత్మక ప్రాంతమైన మొరేనాలోని సుమవాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలింగ్ సమయంలో ఒకే చోట కూర్చోబెట్టారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు జిల్లా ఎస్​పీ శైలేంద్ర సింగ్ చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తన సతీమణి, ఇద్దరు కుమారులతో కలిసి వెళ్లి జైత్‌ గ్రామంలో ఓటేశారు. అంతకుముందు ఆయన ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ప్రతిపక్ష నేత కమల్‌నాథ్‌.. తన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌, కోడలితో కలిసి శికార్‌పుర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, భాజపా అధ్యక్షుడు VD శర్మ, భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ, హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్ర, మంత్రులు యశోధరరాజే సింధియా, రాజ్‌వర్దన్‌సింగ్‌, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జితుపట్వారీ, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి అనుపమ్‌ రాజన్‌ ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటువేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ దిగ్విజయ్‌ సింగ్‌, ఆయన కుమారుడు జైవర్దన్‌సింగ్‌ తమ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి.. ఓటుహక్కు వినియోగించుకున్నారు.

మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

15:51 November 17

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 60.52 శాతం ఓటింగ్ నమోదైంది.

13:59 November 17

మధ్యప్రదేశ్​లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.40% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

11:37 November 17

మధ్యప్రదేశ్​లో ఉదయం 11 గంటల వరకు 27.62% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

09:54 November 17

మధ్యప్రదేశ్​లో ఉదయం 9 గంటల వరకు 11.13 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

09:38 November 17

మోరోనా.. మిర్ఘన్​ డిమానీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 147-148 పోలింగ్​ బూత్​లో హింస చెలరేగింది. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. "ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం అందింది. పోలీసులు చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది" అని డీఎస్పీ విజయ్​ సింగ్​ తెలిపారు.

09:15 November 17

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. ఓటేశారు. సీహోర్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు.. భార్యతో కలిసి ఆయన నర్మదా నది ఒడ్డున పూజలు చేశారు. పలు ఆలయాలను దర్శించుకున్నారు.

08:12 November 17

మధ్యప్రదేశ్​లో తొలిసారిగా ఓటు వేసిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. "ఈ గొప్ప ప్రజాస్వామ్య పండుగ నాడు మధ్యప్రదేశ్​లోని అన్ని ప్రాంతాల్లో ఓటర్లు.. ఉత్సాహంగా ఓటు వేస్తారని నేను విశ్వసిస్తున్నాను. తొలిసారిగా ఓటు వేసిన యువతకు నా ప్రత్యేక శుభాకాంక్షలు" అని రాసుకొచ్చారు.

07:57 November 17

మధ్యప్రదేశ్​ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్​ నేత కమల్​ నాథ్​.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఛింద్వాడ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

07:54 November 17

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు.

06:26 November 17

మధ్యప్రదేశ్​ ఎన్నికల పోలింగ్​

Madhya Pradesh election 2023 polling live updates today
మధ్యప్రదేశ్​ ఎన్నికల పోలింగ్​

Madhya Pradesh Election 2023 : భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొన్న మధ్యప్రదేశ్‌లో శాసనసభ సమరానికి పోలింగ్​ ప్రారంభమైంది. 230 స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్​ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్​, దిండోరీలోని 4 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ మధ్యాహ్నం 3 వరకే జరగనుంది.

మధ్యప్రదేశ్‌ శాసనసభ బరిలో వివిధ పార్టీల తరఫున 2,533 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 5,60,60,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,88,25,607 మంది, మహిళలు 2,72,33,9,45. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 1373 మంది ఉన్నారు.

Last Updated : Nov 17, 2023, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.