ETV Bharat / bharat

Jeevan Case Updates: "ఇదే నాకు ఆఖరి రోజు".. ఇన్​స్టాలో పోస్టు పెట్టిన 8గంటల్లోనే యువకుడు మృతి

author img

By

Published : May 11, 2023, 9:29 AM IST

B Tech Student Jeevan Case Updates: ఈఎంఐ డబ్బులు కట్టమని కొడుక్కి ఆ తండ్రి 12వేల రూపాయలు ఇచ్చాడు. అయితే కొడుకు వాటిని తన అవసరాలకు వాడుకున్నాడు. ఆ విషయం తెలిసిన తండ్రి.. కొడుకుని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒకరోజంతా బయట ఉండి తెల్లారి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రికే స్నేహితుడి పుట్టినరోజు ఉందని చెప్పి బయటకు వచ్చి.. ఇన్​స్టాలో ఇదే తన చివరి రోజంటూ పోస్ట్​ పెట్టాడు. అది పెట్టిన 8గంటల్లోనే విగతజీవిగా మారిపోయాడు. ఇది విజయవాడ శివార్లలో వెలుగు చూసిన ఘటన. పూర్తి వివరాల్లోకెళ్తే..

B Tech Student Jeevan Case Updates
B Tech Student Jeevan Case Updates

B Tech Student Jeevan Case Updates: ‘నాకు ఇదే చివరి రోజు కావచ్చు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి పోస్ట్‌ పెట్టాడు. దానిని చూసిన స్నేహితుడు వెటకారంగా కామెంటు పెట్టాడు. దానికి బదులుగా ‘రాత్రికి నీకే తెలుస్తుందిలే..’ అని ఇన్‌స్టాలో రిప్లై ఇచ్చాడు. ఇది జరిగిన 8 గంటల్లో పోస్టు నిజమైంది. అది పెట్టిన యువకుడు అనుమానాస్పద స్థితిలో కాలిపోయి విగతజీవిగా కనిపించాడు.

విజయవాడ నగర శివార్లలో ఇంజినీరింగ్‌ విద్యార్థి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామ పరిధిలో మృతదేహం మూడొంతులకు పైగా కాలిపోయి, గుర్తించలేని స్థితిలో కనిపించింది. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతిపై పెనమలూరు పోలీసులు ఆనవాళ్లను బట్టి తొలుత హత్యకేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత ఇది ఆత్మహత్య అయ్యి ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

ఈఎంఐ డబ్బు సొంతానికి వాడుకుని: కృష్ణా జిల్లా పెదపులిపాకలో ఇంజనీరింగ్ విద్యార్థి మరణం కలకలం రేపుతోంది. జమ్ములమూడి జీవన్‌ (21) నగరంలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో ఏడాది చదువుతున్నాడు. తల్లిదండ్రులు సుధాకర్, నాగమణి. వీరి స్వగ్రామం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం. వీరు కొంతకాలం క్రితం నగరంలోని క్రీస్తు రాజపురం వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. తండ్రి సుధాకర్‌ ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల లోన్‌ తాలూకూ ఈఎంఐ కట్టమని జీవన్‌కు తండ్రి రూ. 12 వేలు డబ్బులు ఇచ్చాడు. అయితే జీవన్​ ఆ డబ్బును వివిధ అవసరాలకు ఖర్చు చేశాడు. ఈ సంగతి తెలిసి రెండు రోజుల క్రితం తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

స్నేహితుడి ఇంట్లోనే పడుకున్నాడు. తిరిగి మంగళవారం ఇంటికి వచ్చాడు. సాయంత్రం స్నేహితుడి పుట్టిన రోజు పార్టీ ఉందని ఇంట్లో తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. ఆ సమయంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బహుశా.. "ఇదే నా చివరి రోజు" అని పోస్టు పెట్టాడు. దీనిని చూసిన ఓ స్నేహితుడు వెటకారంగా పోస్టు చేశాడు. ‘సరేలే.. ఈరోజు రాత్రికి తెలుస్తుందిలే’ అని అందుకు సమాధానం పెట్టాడు. ఆ తర్వాత.. స్నేహితుడు శ్యామ్‌ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌ కాలనీలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇతను తల్లి నాగమణికి ఫోన్‌ చేసి మామూలుగానే మాట్లాడాడు. పార్టీ ముగిశాక 11 గంటలకు ఇంటికి రానున్నట్లు తెలిపాడు. పార్టీ అనంతరం స్నేహితులతో కలసి అక్కడే నిద్రపోయారు. హఠాత్తుగా 12.30 గంటల సమయంలో స్నేహితుడిని నిద్రలేపి, ద్విచక్ర వాహనం తాళాలు తీసుకుని బయటకు వచ్చాడు.

అమ్మా.. నాన్నను బాగా చూసుకో..: అనంతరం తెల్లవారుజామున 2 గంటల సమయంలో యనమలకుదురులోని పెట్రోల్‌ బంకుకు వెళ్లి.. సీసాలో రూ. వందకు పెట్రోల్‌ పోయించుకున్నాడు. తర్వాత 1.49 గంటల సమయంలో తండ్రి సుధాకర్‌ మొబైల్‌కు ఫోన్‌ చేశాడు. ఈఎంఐ డబ్బును సొంతానికి వాడుకున్నానని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లితో కూడా మాట్లాడాడు. ‘నాన్నను నేను సంతోషపెట్టలేకపోతున్నా.. నేను ఎప్పుడూ మిమ్మల్ని నిరాశపరుస్తూనే ఉన్నా.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.. నన్ను భరించినందుకు కృతజ్ఞతలు అమ్మా.. అని ఫోన్‌ పెట్టేశాడు. తర్వాత మూడు సార్లు ఫోన్‌ చేసినా జీవన్‌ ఎత్తలేదు. అక్కడి నుంచి పెదపులిపాక వెళ్లి పెట్రోల్‌ను తలపై పోసుకుని నిప్పంటించుకుని ఘటనా స్థలంలోనే చనిపోయాడు.

బుధవారం ఉదయం మృతదేహాన్ని పెదపులిపాక రైతులు గుర్తించారు. పెదపులిపాక -చోడవరం కరువు కాల్వ కట్టకు ఫర్లాంగు దూరంలో డొంకరొడ్డులో మృతదేహం పడి ఉంది. తలభాగం నుంచి కాళ్ల వరకూ కాలిపోయి ఉంది. పెట్రోల్‌ బంకు నుంచి ద్విచక్ర వాహనంపై ఒక్కడే బయలుదేరినట్లుగా ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ప్రాథమికంగా ఆత్మహత్య అయి ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ కేసును పెనమలూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం అనంతరం వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో తలపై పెట్రోలు పోసుకుంటుండగా కొంత ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లుగా గుర్తించారు. సొంతంగా నిప్పంటించుకుని మరణించి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.