ETV Bharat / bharat

స్టూడెంట్స్​కు గుడ్ ​న్యూస్.. ఇకపై 6 నెలల ప్రసూతి సెలవులు

author img

By

Published : Mar 7, 2023, 4:48 PM IST

Updated : Mar 7, 2023, 5:58 PM IST

కేరళ యూనివర్సిటీ.. విద్యార్థునులకు శుభవార్త చెప్పింది. యూనివర్సిటీలో చదువుకునే మహిళలకు.. ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరు నెలల పాటు ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.

Kerala University maternity leaves
కేరళ విశ్వవిద్యాలయం ప్రసూతి సెలవులు

మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు కేరళ యూనివర్సిటీ శుభవార్త అందించింది. యూనివర్సిటీలో చదువుకునే మహిళలకు.. ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. 18 సంవత్సరాలు దాటిన అర్హులైన విద్యార్థినులకు.. ఈ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆరు నెలల పాటు ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పీరియడ్స్​ సమయంలో విద్యార్థినులకు సెలవులు ఇస్తుండగా.. తాజాగా కేరళ యూనివర్సిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రసూతి సెలవులు పొందిన విద్యార్థినులు.. మళ్లీ అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కేరళ యూనివర్సిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వారు తిరిగి తరగతులను హాజరు కావచ్చని చెప్పారు. కళాశాలకు తిరిగి వచ్చే విద్యార్థినులు.. అందుకు గర్భం దాల్చినట్లు మెడికల్​ సర్టిఫికేట్​ను​ సమర్పించవలసి ఉంటుందని వెల్లడించారు. వారి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. కళాశాలలో తిరిగి చేరేందుకు యాజమాన్యం అనుమతిస్తుందని తెలిపారు. విద్యార్థినులకు పీరియడ్స్​ సెలవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం అమలు చేసేందుకు కేరళ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. విద్యార్థినుల హాజరు శాతాన్ని 73 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది.

కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా విద్యార్థినులకు 60 రోజుల ప్రసూతి సెలవులను ఇస్తోంది. విద్యార్థినులకు మొదటి సారిగా ప్రసూతి సెలవులను ఇచ్చింది కొచ్చిన్ యూనివర్సిటీనే. కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా విద్యార్థినులకు.. ఆరు నెలల ప్రసూతి సెలవులను అందించనుంది.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో మహిళలకు ప్రసూతి సెలవుల ప్రకటన గమనార్హం.

తరచుగా ఆందోళనలు.. సుప్రీం కోర్టులో వాజ్యం..
పీరియడ్స్​ సెలవులపై కేరళలో తరచుగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యార్ధినులు, మహిళలకు నెలసరి సెలవులు ఇచ్చేలా రాష్ట్రాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషన్​ సైతం దాఖలైంది. ఈ పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్, జస్టిస్​ పీఎస్​ నరసింహ, జస్టిస్​ జేబీ పార్ధీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. ఈ పిల్​ను పరిశీలించిన ధర్మాసనం.. వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయ విద్యార్థి వాదనను పరిగణనలోకి తీసుకుంది. నెలసరి సెలవులు మంజూరు చేయాలని యజమానులను బలవంతం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారు వెనుకాడవచ్చనే వాదనతో ఏకీభవించింది.

Last Updated : Mar 7, 2023, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.