ETV Bharat / bharat

NITలో గ్రాడ్యుయేషన్​.. ఫారిన్​లో MBA.. ఆర్గానిక్​ సబ్బుల బిజినెస్​తో 'ఆమె'కు లాభాల పంట!

author img

By

Published : Jun 23, 2023, 1:48 PM IST

ఓ కశ్మీరీ మహిళ ఆర్గానిక్ సబ్బులను తయారుచేస్తున్నారు. ఆ సబ్బులను వాడిన వారు.. అవి బాగున్నాయని ఆమెకు కితాబిస్తున్నారు. మరి ఆమె ఆ సబ్బులను తయారుచేసేందుకు ఏం వాడుతున్నారో? ఆ సబ్బులను తయారు చేయడం ఎక్కడ నేర్చుకున్నారో ఓ సారి తెలుసుకుందాం.

mountain soap company Kashmir
సనా అఫ్తాబ్

విదేశాల్లో ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగాల కోసం ఆరాటపడలేదు ఓ మహిళ. తనకు నచ్చిన పని చేస్తూ సంతోషాన్ని వెతుక్కున్నారు. ఆమే జమ్ముకశ్మీర్​కు చెందిన సనా అఫ్తాబ్​. ఆర్గానిక్​ సబ్బులను తయారు చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. సనా అఫ్తాబ్​ విజయగాథ గురించి ఓ సారి తెలుసుకుందాం.

సనా అఫ్తాబ్​ స్వస్థలం శ్రీనగర్​లోని బఘత్ బర్జుల్లా. ఆమెకు ఇద్దరు సంతానం. వారిద్దరూ మగపిల్లలే. సనా శ్రీనగర్‌ NITలో గ్రాడ్యుయేట్, మాంచెస్టర్​(యూకే)లో ఎంబీఏ చదివారు. దీంతో ఆమెకు సాంకేతికత, వ్యాపార నైపుణ్యాలు మెండుగా ఉన్నాయి. ఇవే సనాను వ్యాపారం వైపు మళ్లించాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలు, గింజలు, మట్టి, వాల్‌నట్ ఆయిల్, ఆవాల నూనె, తేనె, యాపిల్, లావెండర్‌ నూనెను ఉపయోగించి సబ్బులను తయారు చేస్తున్నారు సనా. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం 'మౌంటెన్ సోప్ కంపెనీ'ని ప్రారంభించారు.

mountain soap company Kashmir
ఆర్గానిక్ సబ్బులను తయారుచేస్తున్న మహిళ సనా అఫ్తాబ్

"నేను మొదట నా కోసం సబ్బులు తయారుచేసుకున్నా. తర్వాత నేను తయారు చేసిన ఆర్గానిక్​ సబ్బులను నా బంధువులు, సన్నిహితులకు పంపించాను. వారు వాటిని ఉపయోగించి చాలా బాగున్నాయని చెప్పారు. సబ్బుల వ్యాపారం ప్రారంభించమని సలహా ఇచ్చారు. అందుకే సబ్బుల బిజినెస్ ప్రారంభించా. వినియోగదారుల నుంచి నేను తయారు చేసిన సబ్బులకు మంచి స్పందన వస్తోంది. త్వరలో ఒక అవుట్‌లెట్‌ను ప్రారంభించాలనుకుంటున్నా. జమ్ముకశ్మీర్​లోని ప్రతి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని భావిస్తున్నా. అప్పుడు వినియోగదారులకు చౌకగా సబ్బులను అందించవచ్చు. అలాగే నేను వ్యాపారంలో లాభం పొందవచ్చు. ఆర్గానిక్ సోప్ కంపెనీని ప్రారంభించడం చాలా సులభం. ఎందుకంటే దీనికి అవసరమైన అన్ని ఉత్పత్తులు స్థానికంగా అందుబాటులో ఉంటాయి. నాకు అన్నీ విధాలా స్నేహితులు అండగా నిలుస్తున్నారు. చాలా కంపెనీలు సబ్బు ఆర్డర్ల కోసం నన్ను సంప్రదిస్తున్నాయి."

-- సనా అఫ్తాబ్​

తనకు సబ్బులు తయారు చేయడం అంటే ఇష్టమని చెబుతున్నారు సనా. కొవిడ్​ లాక్‌డౌన్ సమయంలో.. యూట్యూబ్​, సోషల్ మీడియాలో వీడియోలను చూసి సబ్బులను తయారు చేయడం నేర్చుకున్నానని సనా అంటున్నారు. సబ్బులను తయారు చేయడం నేర్చుకునేందుకు తనకు ఎక్కువ సమయం పట్టలేదని ఆమె చెప్పారు. ప్రస్తుతం తనకు ఉద్యోగం పట్ల ఆసక్తి లేదని చెబుతున్నారు సనా. తన ఇద్దరు బిడ్డల సంరక్షణ చూసుకుంటూ.. సంతోషంగా ఉన్నానని అంటున్నారు. ఉద్యోగంలో చేరితే సబ్బుల తయారీపై ఆసక్తి తగ్గిపోతుందని.. అందుకే వేరే జాబ్​లో చేరనని సనా అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.