ETV Bharat / bharat

రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదం.. బెళగావిలో నిరసనలకు ప్లాన్.. తగ్గేదే లేదన్న సీఎం!

author img

By

Published : Dec 19, 2022, 5:55 PM IST

మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బెళగావిలో మొదలైన నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన నిరసనకారులు బెళగావిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రకు చెందిన విపక్ష పార్టీలు ఎన్సీపీ, శివసేన కార్యకర్తలు నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా.. ఒక్క బెళగావి నగరంలోనే దాదాపు 5వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

Karnataka Maharashtra row
Karnataka Maharashtra row

మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదం ముదురుతోంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న మధ్యవర్తి మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (ఎంఎంఈఎస్) ఆందోళనలకు పిలుపునిచ్చింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న బెళగావి జిల్లాలోనే కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సువర్ణ సౌధ ఉండటం వల్ల ఆందోళనకారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు.

ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనేందుకు మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు తమ కార్యకర్తలతో తరలివచ్చారు. సుమారు మూడు వందల మందికిపైగా కార్యకర్తలు బెళగావి పట్టణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వంతనపైకి చేరుకున్న వారందరినీ బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌సీపీ నేత హసన్‌ ముష్రిఫ్‌, శివసేన కొల్హాపుర్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌ దెవానేతోపాటు వందల మందిని ముందుకు సాగకుండా నిలిపివేశారు. పలువురు కార్యకర్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, సరిహద్దు వివాదంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చీఫ్‌గా ఉన్న మహారాష్ట్ర ఎంపీ ధైర్యశీల్‌ సాంభాజిరావ్‌ మానే కూడా బెళగావిలో పర్యటిస్తానని జిల్లా అధికారులు, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయనను నగరంలోకి రాకుండా కర్ణాటక పోలీసులు నిషేధం విధించారు. నిరసనలతో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కర్ణాటక పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు ఐదు వేల మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తుండగా.. అందులో ఆరుగురు ఎస్పీలు, 11 మంది అడిషనల్‌ ఎస్పీలు, 43 మంది డిప్యూటీ ఎస్పీలు, 95మంది ఇన్‌స్పెక్టర్లు, 241 మంది ఎస్సైలతో కూడిన పోలీసు బృందాలు విధుల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

'కేంద్రమే కారణం'
అంతకుముందు, ఇదే విషయంపై మాట్లాడిన మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే.. ఈ సరిహద్దు వివాదానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. మహారాష్ట్రను విభజించాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించినప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదాన్ని విస్మరించడం సమంజసం కాదని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న మోదీ.. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బెళగావి అంశం మహారాష్ట్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం బలంగా నిలబడుతుందని స్పష్టం చేశారు.

వివాదం ఇదీ..
బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెళగావిని గతంలో కర్ణాటకలో కలిపేశారు. అప్పటి నుంచి కర్ణాటక, మహారాష్ట్ర మధ్య వివాదం సాగుతోంది. కర్ణాటకలో ఉన్న బెళగావి సహా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న 814 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలని మహారాష్ట్ర కోరుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.