ETV Bharat / bharat

Hybrid militants: భద్రతా దళాలకు సరికొత్త సవాలు!

author img

By

Published : Jul 4, 2021, 10:36 PM IST

చడీ చప్పుడు కాకుండా వస్తారు. తాము లక్ష్యంగా చేసుకున్న వారిపై తుపాకీ గురి పెడతారు. అత్యంత సమీపం నుంచే సునాయాసంగా హత్యలు చేస్తారు. తిరిగి తమ పనుల్లో మునిగిపోతారు. పక్కనే తిరుగుతూ అందరిలాగే జీవితం గడుపుతుంటారు. ఇదీ జమ్ముకశ్మీర్‌లో కొత్తగా పుట్టుకొస్తున్న 'హైబ్రిడ్‌ మిలిటెంట్స్' దాడులకు పాల్పడే తీరు...

HYBRID-MILITANTS
Hybrid militants: భద్రతా దళాలకు సరికొత్త సవాలు!

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో 'హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌' రూపంలో భద్రతా దళాలు సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నాయి. గడిచిన కొద్ది వారాలుగా శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లో పలువురిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు క్రమంగా పెరిగిపోయాయి. పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతితో నేరాలకు పాల్పడే యువత సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. అయితే వారంతా ఉగ్రవాదుల జాబితాలో లేనివారు కావడం గమనార్హం. దాడులు చేసి తిరిగి యథావిధిగా తమ జీవనం సాగిస్తుండటంతో హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌ను గుర్తించడం కష్టంగా మారింది.

ఎవరీ హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌?

హైబ్రిడ్‌ మిలిటెంట్స్ వారికి ఇచ్చిన లక్ష్యంపై దాడికి పాల్పడి తిరిగి ఎప్పటిలాగే వారి వ్యక్తిగత కార్యకలాపాల్లో నిమగ్నమైపోతారు. సాధారణంగా ఉగ్రవాదుల జాబితాలో లేకపోవడంతో భద్రతా దళాలకు వీరిని గుర్తించడం చాలా కష్టమవుతోంది. స్థానిక యువతను హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌గా పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థలు, ఆ దేశ గూఢచారి విభాగం ఐఎస్‌ఐ తయారుచేస్తున్నాయని సమాచారం. స్థానికంగా కొందరిని లక్ష్యంగా చేసుకొని అవసరమైనప్పుడు వారిపైకి హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌ను ఆ ఉగ్రముఠాలు ఉసిగొల్పుతాయి. తమకు ఇచ్చిన పనిని ఈ హైబ్రిడ్‌ మిలిటెంట్స్ ఎవరికీ అనుమానం రాకుండా పూర్తి చేసి.. తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తుంటారు. ఆ సమయంలో వారు తమ సాధారణ జీవనశైలినే కొనసాగించడం గమనార్హం.

Hybrid militants
హైబ్రిడ్ మిలిటెంట్స్

వారే లక్ష్యం..!

మైనారిటీ వర్గాలకు చెందిన వారు సహా నిరాయుధులైన ఇతర వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, భద్రత లేని రాజకీయ నాయకులు, విధుల్లో లేని పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని హైబ్రిడ్‌ మిలిటెంట్స్ ఎక్కువగా దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తును అనుసరించి.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారిలో భయాందోళనలు కలిగించడమే వారి ప్రధాన ఉద్దేశం. పథకం ప్రకారమే వారు ముందుగా ఎంచుకున్న వ్యక్తులపై నిఘా పెడతారు. అదను చూసుకొని వారిపై తుపాకులతో దాడి చేస్తారు. అయితే వారు ఎవరినైనా చంపడానికి ప్రత్యేకించి కారణమంటూ ఉండదు. ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేసే నేపథ్యంలో.. సులువుగా చంపగలిగేవారిని ఈ హైబ్రిడ్‌ మిలిటెంట్స్ లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడతారు.

ఇదీ చదవండి: అత్యాధునిక సాంకేతికతతోనే డ్రోనాసురులపై వేట!

కొన్ని ఘటనలు

శ్రీనగర్‌లో జూన్‌ 23న ఉమర్‌ అహ్మద్‌ అనే 25 ఏళ్ల యువకుడిని అతడి దుకాణం ఎదుటే కొందరు మిలిటెంట్లు కాల్చి చంపారు. అంతకుముందు రోజు.. జమ్ముకశ్మీర్‌ సీఐడీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పర్వేజ్‌ అహ్మద్‌ దార్‌ అనే అధికారిని వారు హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆయన్ను వెనుక నుంచి తుపాకీతో కాల్చి చంపిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అదే నెల 27న విధుల్లో లేని ఓ పోలీసు అధికారిని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపి పరారయ్యారు. ఇలా కొద్ది వారాలుగా హైబ్రిడ్‌ మిలిటెంట్స్ ద్వారా ఉగ్రమూకలు చేయిస్తున్న హత్యలు క్రమంగా పెరుగుతున్నాయి.

రోజురోజుకూ పెరుగుతున్న నేరాలపై కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. "శ్రీనగర్‌లో హత్యలకు పాల్పడుతున్న హైబ్రిడ్‌ మిలిటెంట్స్ వ్యవస్థను త్వరలోనే నిర్వీర్యం చేస్తాం. కొందరు స్లీపర్‌ సెల్స్‌గా వ్యవహరిస్తూ ఈ దాడులకు పాల్పడుతున్నారు. పూర్తిస్థాయి ఉగ్రవాదులను సమర్థంగా గుర్తిస్తున్నప్పటికీ.. దాడులు చేసి తిరిగి సాధారణ జీవితంలోకి వెళ్తుండటంతో హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌ను గుర్తించడం కష్టంగా మారింది. అయితే అలాంటి వారిపై నిఘా పెట్టాం" అని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: మారిన యుద్ధతంత్రం- భారత్​ అందిపుచ్చుకునేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.