దీపావళి రోజున ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే.. సిరిసంపదలు మీ సొంతం!

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 11, 2023, 10:39 AM IST

How To Do Lakshmi Pooja On Diwali

How To Do Lakshmi Pooja Diwali : దీపావళి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బాణసంచా మోతలు, తియ్యని మిఠాయి రుచులు, విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడే ఇళ్లు. కానీ, అంత కంటే విశిష్టమైన లక్ష్మీ దేవి పూజ విధానం గురించి ఎక్కువ మందికి తెలియదు. ఈ స్టోరీలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Do Lakshmi Pooja On Diwali Day : దీపావళి పండగను ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా.. చిన్నాపెద్దా సిద్ధమయ్యారు. ఇప్పటికే ధంతేరాస్ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. అవకాశం ఉన్నవారంతా తమ ఇంట "స్వర్ణ కాంతులు" నింపుకున్నారు. ఇక.. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దీపావళి సంబరానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పిల్లలు టపాసులతో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే.. బాణసంచా మూటలు చాలా మంది ఇళ్లకు చేరాయి. పెద్దలు దైవానుగ్రహం కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

దీపావళి రోజున తప్పక చేయాల్సిన పూజల్లో.. లక్ష్మీదేవి పూజ ముందు వరసలో ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటేనే.. డబ్బుకు లోటు ఉండదని హిందువులు విశ్వసిస్తారు. అందుకే.. దేవతానుగ్రహం కోసం.. దేవీ కృపాకటాక్షం తమ మీద నిలవడం కోసం.. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేస్తారు. అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

అయితే.. లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే.. దీపావళి పండగకు రెండు మూడు రోజుల ముందు నుంచే ఇళ్లంతా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత బెడ్​ షీట్లు వంటివి కూడా ఉతుక్కుంటారు. ఉదయాన్నే.. కుటుంబ సభ్యులంతా తలంటు స్నానం చేసి.. కొత్త వస్త్రాలు ధరిస్తారు. దీపం వెలిగిస్తారు. ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కట్టి.. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. సాయంత్రం వేళ ఇల్లు ధగధగా మెరిసిపోయేందుకు.. కొందరు విద్యుత్‌ లైట్లను కూడా ఏర్పాటు చేస్తారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడానికి మరో కారణం కూడా ఉందని చెబుతారు. దీపావళి పండగ రోజునే.. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్లుగా పండితులు చెబుతారు. అందువల్ల.. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే.. సిరిసంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మరి.. ఇంతటి విశిష్టత కలిగిన దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి..? ఎలాంటి నియమాలు పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవి పూజా విధానం :

 • దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేయడం కోసం ఇళ్లంతా శుభ్రం చేయాలి.
 • ఆ తరువాత గంగా జలంతో ఇంటి లోపలా బయటా చల్లాలి.
 • పూజ చేయడం కోసం కొంచెం ఎత్తైన ప్రదేశం (పీఠం) మీద కొత్త వస్త్రాన్ని వేయాలి.
 • ఆ వస్త్రంపై కొంచెం బియ్యాన్ని వేయాలి.
 • కలశం ఏర్పాటు చేయడం కోసం.. రాగి చెంబులో ముప్పావు వంతు నీళ్లను నింపి ఐదు మామిడి ఆకులను వేయాలి.
 • కొన్ని నాణేలను, పువ్వులను కలశం పక్కన ఉంచండి.
 • కలశం పైన కుంకుమతో స్వస్తిక్‌ గుర్తు వేయండియ
 • కలశం పక్కన గణేశ్‌ ప్రతిమను ఉంచండి.
 • మీ వ్యాపారానికి సంబంధించిన వస్తువులు, పుస్తకాలు ఏమైనా ఉంటే కలశం పక్కన పెట్టవచ్చు.
 • హారతి కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో.. పసుపు, కుంకుమ, బియ్యం, గంధం వేయాలి. ఇప్పుడు దీపాన్ని, అగర్‌బత్తీలను వెలిగించాలి.
 • దీపాల వెలుగులో మొదట గణేశుడికి పూజ చేయాలి. ఆ తరవాత లక్ష్మీ దేవిని పూజించాలి.
 • పూజ చేసే సమయంలో కలశంపై అక్షింతలు జల్లుతూ లక్ష్మీదేవీ మంత్రాలను జపించాలి.
 • లక్ష్మీదేవి పూజకోసం నైవేద్యంగా పంచామృతం సమర్పించాలి.
 • పూజ సమయంలో చిన్న గంట మోగిస్తూ.. పూజ చేయాలి.
 • చివరగా కొబ్బరి కాయ కొట్టాలి.
 • పూజ మొత్తం పూర్తయ్యాక.. అందరికీ ప్రసాదం సమర్పించాలి.

'దీపావళి' పురాణ గాథలు తెలుసా? ఇలా చేస్తే సకల సంపదలు మీవే!

దీపావళికి కనులవిందుగా ముస్తాబైన దేవాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.