ETV Bharat / bharat

'ఇప్పుడు నాకు ఎవరూ అడ్డులేరు​.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను'

author img

By

Published : Jul 1, 2022, 4:00 AM IST

Updated : Jul 1, 2022, 6:31 AM IST

Maharashtra CM Eknath shinde Oath: శివసేన రెబల్ నేత ఏక్​నాథ్ శిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Maharashtra CM Eknath shinde
Maharashtra CM Eknath shinde

Maharashtra CM Eknath shinde Oath: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే గురువారం రాత్రి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కీలక వ్యక్తిగా నిలుస్తారనుకున్న వ్యక్తి ఆశ్చర్యకరమైన రీతిలో ఏకంగా సీఎం పదవిని అధిష్ఠించారు. ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా అనంతరం శిందే వర్గీయులతో కలిసి భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అనేక మలుపుల మధ్య ఆయన చివరకు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఉదయం శిందే గోవా నుంచి ముంబయికి చేరుకున్న తర్వాత భాజపా నేతలతో పలు విడతలు మంతనాలు జరిపారు. ఫడణవీస్‌ నివాసంలో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి శిందే రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. మొత్తంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకి ఉందని చెప్పారు. సంతృప్తి చెందిన గవర్నర్‌.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేత రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు.

.

ఫడణవీస్‌ది విశాల హృదయం..
మంత్రివర్గ కూర్పు కొద్దిరోజుల తర్వాత ఉంటుందని ఫడణవీస్‌ ప్రకటించారు. ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని శిందే విలేకరులకు చెప్పారు. తాను తిరుగుబాటు చేసింది రాష్ట్రాభివృద్ధి కోసమేనని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఒక మంత్రిగా ఎంవీయే సర్కారులో పనిచేయడానికి పరిమితులు ఉండేవనీ, అభివృద్ధే ముఖ్యమంత్రిగా తన ఎజెండా అని చెప్పారు. విశాల హృదయంతో సీఎం పదవిని ఫడణవీస్‌ వదులుకున్నారని, తన వెంట వచ్చిన ఎమ్మెల్యేల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని శిందే చెప్పారు. బాలాసాహెబ్‌ సైనికుడినైన తనను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారని, ఈ ఘనత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, ఇతర భాజపా నేతలదేనని అన్నారు. శిందేకి ముంబయిలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఫడణవీస్‌ నివాసానికి వెళ్లేటప్పుడు ఇతర వాహనాల రాకపోకల్ని స్తంభింపజేశారు.

ఉప ముఖ్యమంత్రి అవుతారనుకుంటే..
ఫడణవీస్‌తో కలిసి శిందే గవర్నర్‌ను కలిసినప్పుడు ఫడణవీస్‌కు ముఖ్యమంత్రి పదవి, శిందేకు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రి పదవికి పరిమితం కావడం అనేకమందిని విస్తుబోయేలా చేసింది. ఆయన్ని భాజపా ఆ మేరకు ఒప్పించడానికి కారణాలేమిటనేది స్పష్టంకాలేదు. ‘2019లో భాజపా-శివసేన కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు. శివసేన మాత్రం బాలాసాహెబ్‌ తన జీవితాంతం వ్యతిరేకించిన వారితోనే కూటమి ఏర్పాటు చేసుకుంది. అందుకే కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి నుంచి దూరం జరగాలని శివసేన (రెబల్‌) ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు’ అని ఫడణవీస్‌ వివరించారు. ప్రభుత్వంలో చేరేది లేదనీ, వెలుపలి నుంచే మద్దతు ఇచ్చి.. సజావుగా నడిచేలా చూస్తామని తొలుత ఆయన ప్రకటించారు. కాసేపట్లోనే భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా దిల్లీలో ఒక ప్రకటన చేస్తూ, ప్రభుత్వంలో ఫడణవీస్‌ ఉంటారని స్పష్టంచేశారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో చేరడానికి ఫడణవీస్‌ నిర్ణయించుకున్నట్లు హోంమంత్రి అమిత్‌షా ట్వీట్‌ చేశారు. గువాహటి నుంచి గోవా చేరుకున్న శిందే వర్గీయులు ఇంకా ముంబయికి రాలేదు.

మా నుంచి అడ్డంకులు ఉండవు..
తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ సొంత మార్గాన్ని ఎన్నుకున్నా, వారికి తమ నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ స్పష్టంచేశారు. కొత్త సర్కారులో శివసేన నిర్మాణాత్మక విపక్షంగా వ్యవహరిస్తుందని విలేకరులకు చెప్పారు. తమతో సంబంధాలు తెంచుకున్నందుకు అసమ్మతి ఎమ్మెల్యేలు పశ్చాత్తాపం చెందుతారన్నారు. సేన ఎమ్మెల్యేలపై ఎవరు ఒత్తిడి తెచ్చారో తనకు తెలుసునన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసి, కొత్త ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఆయనతో కలిసి ఉంటామని తెలిపారు. శిందే, ఫడణవీస్‌లకు ఉద్ధవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రకు వారు మంచి చేస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను బొంబాయి హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొంది. ధరావతు రూపంలో పిటిషనర్లు రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే మూడు వారాల తర్వాత వాదనలు ఆలకిస్తామని తెలిపింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే, పార్టీ నేత సంజయ్‌ రౌత్‌లపై దేశద్రోహం కేసు పెట్టాలన్న మరో పిల్‌నూ ధర్మాసనం కొట్టివేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.