ETV Bharat / bharat

'రాజ్యసభకు నేను సరిపోనా?'.. కాంగ్రెస్​పై నగ్మా ఫైర్

author img

By

Published : May 30, 2022, 1:58 PM IST

Congress Rajyasabha: జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం 10 మంది అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్​. సోనియా గాంధీ ఆమోదం అనంతరం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించింది. అయితే తమకు అవకాశం దక్కకపోవడంపై కొంతమంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 ఏళ్ల క్రితం మాటిచ్చి.. ఇప్పటికీ తనను రాజ్యసభకు పంపలేదని, ఆ పదవికి తాను సరిపోనా? అని నగ్మా ట్వీట్ చేశారు. తన తపస్సు కొద్ది దూరంలో ఆగిపోయిందని మరో సీనియర్​ నేత పవన్ ఖేరా అన్నారు.

congress
'రాజ్యసభకు నేను సరిపోనా..' కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై నగ్మా గరం

Congress Rajyasabha Candidates: రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్​. 10 మందితో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది. పి.చిదంబరం, జైరాం రమేశ్, రణ్​దీప్ సింగ్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ వంటి సీనియర్​ నేతలకు అవకాశం కల్పించింది. అయితే తమకూ అవకాశం దక్కుతుందని ఆశించి భంగపాటుకు గురైన మరికొంత మంది సీనియర్ నేతలు అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి వెళ్లగక్కారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ నిరసన గళాన్ని ఎత్తారు.

Rajyasabha Elections: రాజస్థాన్​ నుంచి రణ్​దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీకి కాంగ్రెస్ అవకాశమొచ్చింది. అయితే సొంత రాష్ట్రానికి చెందిన నాయకులు చాలా మంది ఉండగా.. బయటవారికి అవకాశం ఎలా ఇచ్చారని అదే రాష్ట్రానికి చెందిన సిరోహి కాంగ్రెస్​ ఎమ్మెల్యే సన్యం లోధా ప్రశ్నించారు. రాజస్థాన్​ నుంచి తనకు కచ్చితంగా అవకాశం వస్తుందని ఆశించిన పవన్ ఖేరా.. తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. తన తపస్సు కొద్ది దూరంలో ఆగిపోయిందేమో అని ఆదివారం సాయంత్రం వ్యాఖ్యానించారు. అయితే ఆ మరునాడే ఉదయమే ఆయన శాంతించినట్లు కన్పించింది. కాంగ్రెస్​ నేతలందరికీ పార్టీ వల్లే గుర్తింపు వచ్చిందని, ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని మరో ట్వీట్ చేశారు. ఇది తన అభిప్రాయమని, అందుకు కట్టుబడి ఉంటానని కొద్ది రోజుల క్రితం తను చెప్పిన మాటలనే గుర్తు చేశారు. రాజ్యసభకు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Nagma News: మరో సీనియర్ నేత, మాజీ నటి నగ్మ కూడా తనకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. తప్పకుండా పెద్దలు సభకు పంపుతానని 2003-04 సమయంలో సోనియా గాంధీ తనకు మాటిచ్చారని, 18 ఏళ్లు గడిచినా తనకు అవకాశం రాలేదని తెలిపారు. ఇమ్రాన్ భాయ్ వంటి వారికి మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బహుశా తనకు తక్కువ అర్హతలు ఉన్నయేమోనని వ్యాఖ్యానించారు.

Congress News: కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో సీనియర్ నేతలతో పాటు ఇమ్రాన్ ప్రతాప్​గడీ, రంజీత్ రంజన్ వంటి సాధారణ నేతలు ఉన్నారు. దిగ్గత నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మకు చోటు దక్కుతుందని అందరూ భావించినప్పటికీ వారికి అధిష్ఠానం అవకాశం ఇవ్వలేదు. ఇమ్రాన్ యూపీకి చెందిన నాయకుడు అయినప్పటికీ మహారాష్ట్ర నుంచి ఛాన్స్ ఇచ్చారు. రంజీత్ రంజన్​.. ఛత్తీస్​గఢ్​ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. చిదంబరం మరోసారి తమిళనాడు నుంచి, వివేక్ తంఖా మధ్యప్రదేశ్​ నుంచి పెద్దల సభకు వెళ్తున్నారు. 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా.. నిర్మల, పీయూష్​కు ఛాన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.