ETV Bharat / bharat

మావోయిస్టుల IED దాడి.. 10 మంది పోలీసులు మృతి

author img

By

Published : Apr 26, 2023, 3:19 PM IST

Updated : Apr 26, 2023, 7:15 PM IST

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల దాడిలో 11 మంది మరణించారు. దంతెవాడలో బుధవారం జరిగిందీ ఘటన. మృతుల్లో 10 మంది పోలీసులు కాగా.. ఒకరు డ్రైవర్.

chhattisgarh blast news
chhattisgarh blast news

మావోయిస్టుల IED దాడిలో 10 మంది పోలీసులు మృతి

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది పోలీసులు కాగా ఒకరు డ్రైవర్. దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్‌ రిజర్వ్‌గార్డ్‌( DRG) పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్​పుర్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సీఎం బగేల్​కు షా ఫోన్​
మావోయిస్టుల దాడిని ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ బగేల్​ ధ్రువీకరించారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నక్సలైట్లతో పోరు తుది దశకు చేరుకుందని, వారిని విడిచి పెట్టబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దాడి సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్​కు ఫోన్​ చేసి మాట్లాడారు. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నక్సల్‌దాడిని ఖండించిన ప్రధాని మోదీ.. అమర జవానుల త్యాగాలు వృథా కాబోవని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

అనేక మంది జవాన్లు వీరమరణం
ఛత్తీస్​గఢ్​లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు జరుగుతుంటాయి. 2021 ఏప్రిల్​లో భద్రతా దళాలు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో సుమారు 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన బీజాపుర్​, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగింది. అంతకుముందు 2018 మార్చిలో 9 మంది సీఆర్పీఎఫ్​ బలగాలు, ఫిబ్రవరిలో ఇద్దరు, 2017 ఏప్రిల్​లో 24 మంది మరణించారు.

పోలీస్ ఎన్​కౌంటర్​లో ఐదుగురు నక్సలైట్లు మృతి
ఇటీవలే ఝార్ఖండ్​లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందారు. వీరిలో ఇద్దరిని స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.రాజధాని రాంచీకి 160 కి.మీ. దూరంలోని ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడం వల్ల సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. ఎదురుకాల్పులు జరిపినట్లు ఝార్ఖండ్‌ డీజీపీ అజయ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారని.. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, రెండు నాటు తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. నక్సల్స్‌ తలదాచుకున్న శిబిరాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి : మాజీ సీఎం ప్రకాశ్​ సింగ్​ బాదల్​ భౌతికకాయానికి మోదీ నివాళులు

వందేభారత్​లో వాటర్​ లీక్​.. ప్రారంభించిన రోజే అంతరాయం.. నిలిచిన రైలు!

Last Updated : Apr 26, 2023, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.