ETV Bharat / bharat

'టీ3' వ్యూహంతో  కరోనా మహమ్మారిపై త్రిముఖ పోరు

author img

By

Published : Mar 29, 2020, 7:44 AM IST

దేశంలో వందల్లో ఉన్న కరోనా కేసులు.. లక్షలకు చేరుతాయన్న భయాలు నెలకొన్నాయి. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే దక్షిణ కొరియా తరహాలో 'టీ 3' (ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌ - ఆచూకీ, పరీక్ష, చికిత్స) అనే త్రిముఖ వ్యూహం చేపట్టాలి. అనుమానితుల ఆచూకీని వెంటనే పసిగట్టి, వారిని పరీక్షించి, శీఘ్ర చికిత్స అందించాలి. కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్పందికి వైరస్‌ సోకకుండా వ్యక్తిగత రక్షణ సామగ్రిని అందించాలి. వాటికి స్వదేశంలో కొరత ఏర్పడినందున... దీన్ని తీర్చడానికి ప్రభుత్వం భారీయెత్తున ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి.

Trivial fight over Coronavirus with 'T3'
'టీ3'తో మహమ్మారిపై త్రిముఖ పోరు

ఇప్పుడు వందల్లో ఉన్న కొవిడ్‌ 19 (కరోనా) కేసులు మున్ముందు లక్షలకు చేరతాయేమోననే ఆందోళన భారతదేశంలో పెరుగుతోంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే దక్షిణ కొరియా తరహాలో 'టీ 3' (ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌ - ఆచూకీ, పరీక్ష, చికిత్స) అనే త్రిముఖ వ్యూహం చేపట్టాలి. కరోనా అనుమానితుల ఆచూకీని వెంటనే పసిగట్టి, వారిని పరీక్షించి, శీఘ్ర చికిత్స అందించాలి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం టీ 3 వ్యూహాన్ని చేపడుతున్నట్లు ఇటీవల ప్రకటించడం స్వాగతించాల్సిన అంశం. దీన్ని దేశమంతటికీ విస్తరించాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా కేసుల పరీక్ష, క్వారంటైన్‌, చికిత్స పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కానీ, ప్రభుత్వ రంగంలో సుశిక్షిత వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బందికి ఎప్పుడూ కొరతే. 130 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి కేవలం 9.26 లక్షలమంది ప్రభుత్వ రంగ వైద్యులు ఉన్నారు. వీరిలో కూడా రోగులకు మత్తు ఇవ్వడంలో, అత్యవసర, శ్వాసకోశ వ్యాధి చికిత్సలలో శిక్షణ పొందిన నిపుణుల సంఖ్య 20వేలకు మించదు. ప్రస్తుత సంక్షోభంలో వీరి ఆవశ్యకత అంతా ఇంతా కాదు. కానీ, కరోనా చికిత్సకు రేయింబవళ్లు శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని పలు చోట్ల ఇళ్ల యజమానులు వెలివేయడం దిగ్భ్రాంతపరుస్తోంది. కరోనాపై ఎదురొడ్డి పోరాడుతున్న ప్రభుత్వ వైద్య యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని ఇలా దెబ్బతీస్తే, రేపు లక్షల్లో కరోనా కేసులను ఎదుర్కోవాలంటే దిక్కెవరు?

ఆచూకీ కనిపెట్టడం కీలకం

కరోనా అనుమానితుల జాడను చప్పున పసిగట్టడం టీ 3 వ్యూహంలో మొదటి అంచె. దక్షిణ కొరియా, సింగపూర్‌లలో సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఈ పని సమర్థంగా నిర్వహించినందునే, అక్కడ పరిస్థితి వేగంగా అదుపులోకి వచ్చింది. భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు గ్రామీణ శిశు సంరక్షణ వర్కర్లకు ఈ బాధ్యత అప్పగించారు. దాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. కరోనా అనుమానితుల జాడను పసిగట్టడానికి దక్షిణ కొరియా, సింగపూర్‌ల మాదిరిగా భారత్‌ కూడా 'కొవిన్‌ 20, కరోనా కవచ్‌' అనే మొబైల్‌ యాప్‌లను ప్రయోగించబోతోంది. మన కరోనా కేసుల్లో విదేశాల నుంచి తిరిగొచ్చిన భారతీయల సంఖ్యే అధికం. వారి ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులు, సహోద్యోగులకు, తోటి ప్రయాణికులకు కరోనా సోకే ప్రమాదం ఉంది. మొబైల్‌ ఫోన్‌ నంబరు, దాని 'జీపీఎస్‌ లొకేషన్‌'లను ఉపయోగించి కరోనా అనుమానితుడు ఎవరెవరిని కలిసినదీ పసిగట్టడానికి 'కరోనా కవచ్‌' తోడ్పడుతుంది. కరోనా బాధితులు లేదా అనుమానితులు తిరిగిన ప్రదేశాలకు దూరంగా ఉండాల్సిందిగా, ఫోన్‌ వాడకందారులను కరోనా కవచ్‌ బ్లూటూత్‌ సాయంతో హెచ్చరిస్తుంది. కొవిన్‌ 20 యాప్‌ మొబైల్‌ వాడకందారుని ప్రయాణ వివరాలను తెలుసుకుని కరోనా వ్యాపించిన ప్రాంతాల్లో అతడు సంచరించినదీ లేనిదీ నిర్ధారిస్తుంది. దాంతోపాటే కరోనా నిర్ధారణ పరీక్షకు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం చిరునామాను తెలుపుతుంది.

వైద్యులు, వెంటిలేటర్ల కొరత

ప్రతి వెయ్యి మంది ప్రజలకు ఒక డాక్టరు చొప్పున ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తుంటే, 65శాతం భారతీయులు నివసించే గ్రామాల్లో- ప్రతి 10,189 మందికి ఒక డాక్టరు చొప్పున ఉన్నారు. ఈ లెక్కన మన దేశానికి ఇంకా ఆరు లక్షలమంది వైద్యులు, 20 లక్షలమంది నర్సులు కావాలి. కావలసిన సంఖ్యలో ఆస్పత్రి పడకలూ లేకపోవడం మరింత ఆందోళనకరం. 2019 జాతీయ ఆరోగ్య గణాంకాల ప్రకారం మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,13,986 పడకలు ఉన్నాయి. అంటే ప్రతి వెయ్యి మంది రోగులకు కేవలం 0.55 పడకలన్నమాట. కరోనా సోకిన రోగుల్లో అయిదు నుంచి పది శాతానికి 'ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)'లలో వెంటిలేటర్లతో అత్యవసర చికిత్స అందించాల్సి ఉంటుంది. కరోనా కేసులు 10 లేదా 20 లక్షలకు చేరితే, లక్ష నుంచి రెండు లక్షల వరకు వెంటిలేటర్లు అవసరమవుతాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయో తెలిపే అధికారిక లెక్కలు లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ఏడు లక్షల పైచిలుకు పడకల్లో 35వేల నుంచి 57వేల వరకు ఐసీయూ పడకలని ఒక అంచనా. వీటిలో సగానికి వెంటిలేటర్లు ఉన్నాయనుకున్నా- దాదాపు 18వేల నుంచి 26వేల వరకు వెంటిలేటర్లు ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం లాక్‌డౌన్‌, సామాజిక దూరం వంటి పద్ధతుల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల పడకల మీద ఒత్తిడి తగ్గిస్తున్నా, మున్ముందు కరోనా కేసులు పెరిగితే పడకలు, వెంటిలేటర్లు భారీగా అవసరపడతాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం వెంటిలేటర్లతోపాటు శానిటైజర్లు, మాస్కులు, శ్వాసకు తోడ్పడే ఇతర సాధనాల ఎగుమతిని నిషేధించింది.

విడిభాగాల కొరత

దేశంలో పెరుగుతున్న గిరాకీని తీర్చడానికి తన ఉత్పత్తిని 20వేల వెంటిలేటర్లకు పెంచాలని 'ఎగ్వా హెల్త్‌ కేర్‌' భావిస్తున్నా విడిభాగాల కొరత అడ్డువస్తోంది. అంతర్జాతీయ విమానాలను రద్దుచేసినందున ఎగ్వా సంస్థ చైనా నుంచి వెంటలేటర్ల ఎలెక్ట్రానిక్‌ విడిభాగాలను దిగుమతి చేసుకోలేకపోతోంది. సరఫరా విచ్ఛిన్నం ఎగ్వాతోపాటు దేశంలోని దాదాపు 800 వైద్య సాధనాల ఉత్పత్తి సంస్థలనీ దెబ్బతీస్తోంది. వాటికి కావలసిన విడిభాగాల్లో 60 శాతం చైనా నుంచి దిగుమతి అవుతాయి. మైసూరుకు చెందిన వైద్య ఎలెక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థ 'శ్కాన్‌ రే' లక్ష వెంటిలేటర్లను తయారుచేయాలనుకుంటున్నా, విడిభాగాల సమస్య అడ్డువస్తోంది. మోటారు వాహనాల తయారీ సంస్థ మహింద్రా గ్రూపు తమ కర్మాగారాల్లో వెంటిలేటర్లు తయారుచేసి, రూ.7,500 లోపు ధరకే అందిస్తామని ప్రకటించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఏక కాలంలో అనేకమందికి సేవలు అందించగల వెంటిలేటర్‌ను రూపొందించింది. దాని డిజైన్‌ను తొమ్మిది కంపెనీలకు అందించి భారీఎత్తున ఉత్పత్తికి బాట వేసింది.

రక్షణ కవచాలు అవసరం

కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్పందికి వైరస్‌ సోకకుండా వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)ని, ఎన్‌-95 మాస్కులను, శరీర ఆచ్ఛాదనలను (కవరాల్స్‌) అందించాల్సి ఉంది. కానీ, వాటికి స్వదేశంలో కొరత ఏర్పడింది. దీన్ని తీర్చడానికి ప్రభుత్వం భారీయెత్తున ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వ రంగంలో వైద్యులు, పడకలు, టెస్ట్‌ కిట్లు, వెంటిలేటర్లు ఇతర సామగ్రికి తీవ్ర కొరత ఉన్నందున కరోనా నిర్మూలనకు ప్రైవేటు రంగ భాగస్వామ్యం తీసుకోవాలి. రిలయన్స్‌ సంస్థ కరోనా బాధితుల కోసం ముంబయిలో వంద పడకల ఆస్పత్రి నిర్మించింది. అపోలో తదితర ప్రైవేటు ఆస్పత్రులు తమ పడకలను అందుబాటులో ఉంచుతామంటున్నాయి. కొవిడ్‌ 19 చికిత్సకు సైన్యం, వైమానిక, నౌకా దళాలకు చెందిన 28 ఆస్పత్రులను అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వం చైనా మాదిరిగా వెయ్యి, రెండు వేల పడకల ఆస్పత్రులను వేగంగా నిర్మించాలి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ స్టేడియాలు, హోటళ్లు, హాస్టళ్లు, ఇతర ఖాళీ భవనాలను చికిత్సా కేంద్రాలుగా మార్చాలి. ఉద్యోగ విరమణ చేసిన వైద్యులు, నర్సులతోపాటు ఆర్‌ఎంపీల సేవలనూ ఉపయోగించుకోవాలి. టెలిమెడిసిన్‌ ద్వారా పట్టణాలతోపాటు గ్రామాలకూ చికిత్స సదుపాయం అందించాలి. ఇంటికే మందులు పంపే ఏర్పాటు చేయాలి.

మందుల తయారీకి ప్రాధాన్యమివ్వాలి

కరోనా వ్యాక్సిన్‌ తయారీకి చాలా సమయం పట్టేలా ఉంది కాబట్టి, మందుల తయారీకి అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటికే వివిధ రోగాలకు అందుబాటులో ఉన్న 70 మందులను కొవిడ్‌ 19 చికిత్సకు వాడవచ్చా- అనేదానిపై ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా క్లోరోక్విన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, రెండెసివిర్‌, లోపినావిర్‌-రిటోనావిర్‌ మిశ్రమం, లోపినావిర్‌-రిటోనావిర్‌-ఇంటర్‌ ఫెరాన్‌ బీటా మిశ్రమాలతో నార్వే, స్పెయిన్‌లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయోగాలు ఆరంభించింది. భారత ప్రభుత్వ పరిశోధనాలయాలైన సీఎస్‌ఐఆర్‌, ఐఐసీటీలు ఫావీపిరావిర్‌, రెండెసివిర్‌, బాలోక్సావిర్‌ అనే మూడు రకాల యాంటీ వైరల్‌ మందులతో కరోనా చికిత్సకు ప్రయోగాలు చేస్తున్నాయి. అవి విజయవంతమైతే వాణిజ్య స్థాయిలో కరోనా మందులను తయారుచేయడానికి ఫార్మా సంస్థ సిప్లా సిద్ధంగా ఉంది. కొత్త మందులు, వ్యాక్సిన్ల తయారీకి ముందుకొచ్చే దేశీయ కంపెనీలకు వెంటనే అనుమతి ఇస్తామని డీజీసీఐ ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్‌ సీమా మిశ్రా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేపట్టారు. కొవిడ్‌ 19 కట్టడికి ఇలా బహుముఖ పోరాటం జరపడం ఎంతో అవసరం. ఈ పోరులో భారత్‌ గెలిచితీరాలి.

పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు

రోనా పరీక్ష కిట్లకు తీవ్ర కొరత ఉండటంతో భారత్‌ భారీగా పరీక్షలను నిర్వహించలేకపోతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మైల్యాబ్‌ సంస్థ రూపొందించిన కొవిడ్‌ 19 రోగ నిర్ధారణ కిట్‌కు ప్రభుత్వం వేగంగా అనుమతి ఇచ్చింది. వారానికి లక్ష కిట్ల చొప్పున తయారు చేయగలనని, తరవాత అవసరమైతే మరిన్ని కిట్లను అందించగలనని మైల్యాబ్‌ ప్రకటించింది. మైల్యాబ్‌ కిట్‌తో పెద్ద లేబొరేటరీల్లో వెయ్యి నమూనాలను, చిన్న ల్యాబ్‌లలో 200 నమూనాలనూ పరీక్షించవచ్చు. పరీక్ష ఫలితాలు రెండున్నర గంటల్లోనే లభిస్తాయి. ఒక్కో కిట్‌ ధరను రూ.1,200గా నిర్ణయిస్తారని తెలిసింది. మై ల్యాబ్‌ కిట్‌లో వాడే విడి భాగాలేవీ చైనా నుంచి దిగుమతి కావడం లేదు. వాటిలో అత్యధికం భారత్‌లోనే తయారవుతాయి. జర్మనీకి చెందిన 'అల్టోనా డయాగ్నస్టిక్స్‌' సంస్థ కూడా కరోనా టెస్ట్‌ కిట్ల తయారీకి అనుమతి పొందింది. అవన్నీ దిగుమతి అయ్యే కిట్లు కాబట్టి ధర ఎక్కువే ఉండవచ్చు. అమెరికాకు చెందిన 'కోశారా డయాగ్నస్టిక్స్‌' సంస్థ కూడా భారత్‌లో టెస్ట్‌ల నిర్వహణకు దరఖాస్తు చేసింది. తమ దరఖాస్తు ఆమోదం పొందితే ఏప్రిల్‌ నుంచే టెస్ట్‌ కిట్ల ఉత్పత్తి ప్రారంభిస్తామంటోంది. కొవిడ్‌ 19 కిట్ల నాణ్యతను పరీక్షించి ధ్రువీకరించడానికి డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఏ) స్విస్‌ కంపెనీ 'రోషే'తో సహా 14 ప్రైవేటు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు కరోనా పరీక్షకు ఏఐఐఎంఎస్‌, అపోలో హాస్పిటల్స్‌ సహా దేశమంతటా 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి ఇచ్చింది.

-ఏఏవీ ప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.