ETV Bharat / bharat

'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం'

author img

By

Published : Aug 12, 2020, 5:12 AM IST

Updated : Aug 12, 2020, 6:15 AM IST

తూర్పు లద్దాఖ్​ వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీకి తెలిపారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్ రావత్. కఠినమైన శీతాకాలంలోనూ దీర్ఘకాలం పాటు పోరాటం కొనసాగించే విధంగా సాయుధ దళాలు సన్నద్ధమైనట్లు చెప్పారు.

CDS briefs Parliament's PAC on situation at LAC in Ladakh
'ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సైన్యం సిద్ధం'

భారత సాయుధ దళాలు.. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నట్లు పార్లమెంట్​ పబ్లిక్ అకౌంట్స్​ కమిటీ(పీఏసీ)కి వివరించారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​. శీతాకాలంలో కఠినమైన పరిస్థితుల్లోనూ సుదీర్ఘకాలం సవాళ్లను ఎదుర్కొనేందుకూ సైన్యం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

భారత సైన్యానికి అత్యంత నాణ్యమైన దుస్తులు సేకరించే విషయంపై చర్చించేందుకు పీఏసీతో మంగళవారం సమావేశమయ్యారు జనరల్​ రావత్, ఇతర సైనిక ఉన్నత కమాండర్లు. ఈ సందర్భంగానే తూర్పు లద్దాఖ్​లో పరిస్థితులపై ఆయన వివరించినట్లు కమిటీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం సర్వసన్నద్ధతపై రావత్ పూర్తి నమ్మకంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. పీఏసీకి కాంగ్రెస్​ లోక్​సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు.

తూర్పు లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణ అంశంపై భారత్​-చైనా దౌత్య, సైనిక చర్చలు జరపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తయినా.. ఫింగర్​ ఏరియా ప్రాంతాల నుంచి మాత్రం బలగాలను వెనక్కి తీసుకోవడం లేదు చైనా. కచ్చితంగా ఆ ప్రాంతాల్లో నుంచి వెనక్కి మళ్లాలని చైనాకు.. భారత్ ఇప్పటికే తేల్చిచెప్పింది.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు సహా తూర్పు లద్దాఖ్​లో కార్యకలాపాలను పెంచింది భారత సైన్యం. చైనాకు దీటుగా బలగాలను మోహరించింది.

శీతాకాలంలో లద్దాఖ్​లో మైనస్ 25 డిగ్రీ సెల్సియస్​​ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎముకలు కొరికే చలి, కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది భారత సైన్యం. సైనికులకు అవసరమైన ఆయుధాలు, దుస్తులు సమకూర్చే పనిలో ఉంది.

ఇదీ చూడండి: ప్రణాళికా లోపాలే లద్దాఖ్​లో సైనికుల పాలిట శాపాలు

Last Updated : Aug 12, 2020, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.