ETV Bharat / bharat

పైలట్ తిరిగొచ్చినా యథావిధిగా బలపరీక్ష!

author img

By

Published : Aug 13, 2020, 1:29 PM IST

Updated : Aug 13, 2020, 1:55 PM IST

తిరుగుబాటు వర్గం కాంగ్రెస్ గూటికి చేరినప్పటికీ.. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గహ్లోత్ ప్రభుత్వం పట్టుబట్టింది. బలపరీక్ష నిర్వహించడం ద్వారా తమ ఐకమత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భాజపా ప్రయత్నాలు విఫలమయ్యాయని, రాజస్థాన్​లో ప్రభుత్వం స్థిరంగా ఉందన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని గహ్లోత్​ యోచిస్తున్నట్లు సమాచారం.

Ashok Gehlot to call for floor test despite Pilot camp rolling back their rebellion
పైలట్ తిరిగొచ్చినా యథావిధిగా బలపరీక్ష!

రాజస్థాన్​లో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్, అతని వర్గం తిరిగి కాంగ్రెస్​లోకి వచ్చినప్పటికీ.. బలపరీక్ష విషయంపై గహ్లోత్ ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. ఆగస్టు 14న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రణాళిక ప్రకారమే బలపరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. బలపరీక్ష నిర్వహించడం ద్వారా తమ ఐకమత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది.

సచిన్ తిరుగుబాటుతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి తలెత్తింది. బలపరీక్ష నిర్వహిస్తే ఆరు నెలల వరకు పరిస్థితి తిరిగి మారిపోయే అవకాశముండదని నిపుణులు భావిస్తున్నారు. పైలట్ రాకతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 107కి పెరిగింది. సంకీర్ణ పక్షాల మద్దతు ఉంది కాబట్టి బలపరీక్ష నిర్వహించేందుకే కాంగ్రెస్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

ఈ దిశగా భాజపా ఎలాంటి ప్రయత్నాలు చేయనప్పటికీ.. బలపరీక్ష ద్వారా పార్టీకి ఉపశమనం లభిస్తుందని, తద్వారా అసంతృప్త నేతల సమస్యను పరిష్కరించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భాజపా ప్రయత్నాలు విఫలమయ్యాయనే యోచనలో ఉంది కాంగ్రెస్. రాష్ట్రంలో ప్రభుత్వం స్థిరంగా ఉందన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలనే తలంపుతో ఉంది.

దూరంగానే పైలట్ వర్గం!

మరోవైపు గహ్లోత్​కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు జైసల్మీర్ నుంచి జైపుర్​ ఫెయిర్​మౌంట్ హోటల్​కు తిరిగివచ్చారు. పైలట్ వర్గాన్ని మాత్రం ఫెయిర్​మౌంట్​కి ఆహ్వానించలేదు. రెండు వర్గాల మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు గహ్లోత్ వర్గం హోటల్లోనే ఉంటారని తెలుస్తోంది.

"కాంగ్రెస్ రిస్క్ చేయాలని అనుకోవడం లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఓ కన్నేసి ఉంచింది. వారిని ఇప్పుడే విశ్వసించకపోవచ్చు. రెబల్ ఎమ్మెల్యేలపై తాము ఆధారపడి లేమని కాంగ్రెస్ సందేశమివ్వాలని అనుకుంటోంది. వారి మద్దతు లేకుండానే బలపరీక్ష గెలిచే సత్తా ఉందని చెప్పాలని అనుకుంటోంది."

-రాజకీయ నిపుణులు

మరోవైపు పైలట్, గహ్లోత్ వర్గాల ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వేర్వేరుగా చర్చలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి శాసనసభ్యుల సమావేశం నిర్వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్​లో విలీనమైన ఆరుగురు బీఎస్​పీ ఎమ్మెల్యేల సభ్యత్వంపై స్టేకు నిరాకరించిన హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు భాజపా ఎమ్మెల్యే మదన్ దిలావర్.

ఇదీ చదవండి- మోదీతో వేదిక పంచుకున్న ట్రస్ట్​ అధ్యక్షుడికి కరోనా

Last Updated : Aug 13, 2020, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.