ETV Bharat / bharat

నా మాట వినకపోవడం బాధాకరం: హర్​సిమ్రత్

author img

By

Published : Sep 18, 2020, 7:15 PM IST

రైతులకు మద్దతుగా వినిపించిన గళాన్ని కేంద్రం పట్టించుకోలేదని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్​సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. కేంద్ర పదవికి రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బిల్లులపై రైతులకు భయాలున్నాయని అన్నారు. రాజీనామా చేయడంలో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు.

agriculture-related-bills-should-have-been-brought-after-taking-farmers-into-confidence-harsimrat-kaur-badal
రాజీనామా.. రాజకీయం కాదు- హర్​సిమ్రత్ కౌర్

రైతులకు మద్దతుగా తాను వినిపించిన గళాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్​సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిలిపివేసి సమీక్ష కోసం పార్లమెంటరీ ప్యానెల్​కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు కౌర్. తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. రైతులను సంప్రదించిన తర్వాతే ఈ బిల్లులను తీసుకురావాలని సూచించారు. బిల్లులపై రైతులకే భయాలు ఉన్నాయని.. అలాంటప్పుడు వారి ప్రయోజనార్థమే బిల్లులు తీసుకొస్తున్నామని కేంద్రం చెప్పడంలో అర్థంలేదన్నారు.

"కేబినెట్​ సభ్యుల స్పందన కోరినప్పటి నుంచి ఆర్డినెన్సుపై నేను నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాను. వ్యవసాయదారుల ఆందోళనలకు పరిష్కారం లభించేలా రైతులకు, ప్రభుత్వానికి వారధిలా ఉన్నాను. నా గళాన్ని ప్రభుత్వం వినిపించుకోనందుకు చాలా బాధగా ఉంది. నా మాట విని ఉంటే ఇంత మంది రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన చేసేవారు కాదు."

-హర్​సిమ్రత్ కౌర్ బాదల్, అకాలీదళ్ ఎంపీ

రాజీనామాపై స్పందించిన కౌర్.. పంజాబ్ ప్రజల ప్రతినిధిగా అది తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. కౌర్ రాజీనామాను డ్రామాగా అభివర్ణించిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

"రైతులను సంప్రదించి బిల్లులను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను. ఇందులో రాజకీయం ఏముంది? పంజాబ్​లోనే కాదు హరియాణా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్రలోనూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దక్షిణాదిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది."

-హర్​సిమ్రత్ కౌర్ బాదల్, అకాలీదళ్ ఎంపీ

2014 నుంచి మంత్రి వర్గంలో ఉన్నారు హర్​సిమ్రత్ కౌర్ బాదల్. అప్పటి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యం వహించారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, తన భర్త సుఖ్​బీర్​ సింగ్ బాదల్.. లోక్​సభలో ప్రకటన చేసిన అనంతరం తన పదవికి రాజీనామా చేశారు కౌర్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.