ETV Bharat / bharat

మరో సిపాయిల తిరుగుబాటుకు బాటలు వేసిన 'పిగ్ రూపాయి'

author img

By

Published : Jul 20, 2022, 6:40 AM IST

తుపాకుల తూటాలకు పంది, ఆవు కొవ్వులను పూతగా పూయడం వల్ల సిపాయిలు తిరగబడ్డారు. అది క్రమంగా ప్రథమ స్వాతంత్య్ర సమరానికి దారితీసింది. దీంతో బ్రిటిష్‌ పాలకులు గడగడలాడారు. ఆ భయం ఇంకా వారి గుండెల్లో ఉండగానే అటువంటి సంఘటన 1911లో ఒకటి జరిగింది. అయితే ఈసారి వారు తప్పును వేగంగా దిద్దుకున్నారు. లేదంటే ప్రజల నుంచి మరో భారీ తిరుగుబాటును చవిచూడాల్సి వచ్చేది.

1911 pig rupee
1911 pig rupee

కరెన్సీ అనేది ఒక దేశ విశ్వసనీయతకు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. బ్రిటిష్‌ రాజ్‌ కాలంలో మన కరెన్సీ ప్రమాణాలు, నిల్వలు, నాణేల్లో ఏ లోహాలు ఎంత మేర వాడాలనేది వారే నిర్ణయించేవారు. 1910 మేలో బ్రిటన్‌ చక్రవర్తి కింగ్‌ ఎడ్వర్డ్‌-7 మరణించారు. ఆయన స్థానంలో కింగ్‌ జార్జ్‌-5 పీఠమెక్కారు. ప్రతీ పట్టాభిషేకానికి భారత్‌లో 'గ్రాండ్‌ దర్బార్‌'ను ఏర్పాటు చేయడం తెల్లవారికి అలవాటు. కొత్తరాజు ముఖంతో నూతన నాణేలను తయారు చేయడమూ రివాజే. ఇందుకోసం ప్రముఖ శిల్పి, నాణేల రూపకర్త సర్‌ బెర్‌ట్రాండ్‌ను నియమించారు. రాజు తలచుకుంటే నాణేలకు కొదవ ఏముంటుంది? వెంటనే 94 లక్షల వరకు రూపాయి, ఇతరత్రా వెండి నాణేలను సేకరించారు. వాటిని కరిగించి, కొత్త నాణేలను ముద్రించారు. రూ.1 విలువైన ఈ నాణేలన్నీ చలామణిలోకి వెళ్లాయి.

.

ఇక్కడే అసలు కథ మొదలైంది..: నాణేనికి ఒకవైపు కింగ్‌ జార్జ్‌-5 బొమ్మను ముద్రించారు. మరోవైపు పువ్వులు, తీగల డిజైన్‌తోపాటు ఒక రూపాయి, భారత్‌, 1911 అని ముద్రించారు. ఇంతవరకు బాగానే ఉంది. కింగ్‌ జార్జ్‌-5 కాలర్‌ చైన్‌ను బంగారు ఏనుగులు, రోజా పువ్వులు, నెమళ్లతో అలంకరించారు. ఏనుగు వద్దే సమస్య వచ్చింది. ఏనుగులా ఉండాల్సిన బొమ్మ కాస్తా దాని శరీరం, కాళ్లు, తోక, తొండం సరిగ్గా లేకపోవడంతో పందిలా కనిపించింది. దాంతో వాటిని 'పిగ్‌ రుపీస్‌'గా పిలవడం మొదలైంది. ఇదంతా ముస్లిం వర్గానికి అంతగా రుచించలేదు. రోజువారీ వినియోగించే ఈ నాణేన్ని చలామణిలోకి తేవడాన్ని తమను కించపరచడంగానే భావించారు. ఆందోళనలు చేపట్టారు. విషయం బ్రిటిష్‌ పాలకుల వరకు చేరింది. 1857 తిరుగుబాటు నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా వారి మెదళ్ల నుంచి చెరిగిపోలేదు. ఇప్పుడూ అదేమాదిరిగా తిరుగుబాటు మొదలైతే? ఈ అనుమానం వచ్చిందే తడవుగా చలామణిలో ఉన్న ఆ నాణేలను ఉపసంహరించుకున్నారు. వినియోగంలో లేని నాణేలు కూడా భారీగానే చేరాయి. వీటన్నిటినీనీ కరిగించి.. 1912లో ఏనుగు బొమ్మలో తొండం, దంతాలు, కాళ్లు సరైన నిష్పత్తిలో వచ్చేలా ముద్రించారు. వీటిని 'ఎలిఫెంట్‌ రుపీ'లుగా పిలిచేవారు. అలా ముద్రించిన 'పిగ్‌ రుపీలు' వారికే నిద్రలేకుండా చేశాయి. నాణేల సేకర్తల దగ్గర ఇప్పటికీ ఈ పిగ్‌ రుపీలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి.

కాగితం నోట్లు వచ్చాయిలా..: భారత్‌లో మొదటి నుంచీ వివిధ లోహాలతో చేసిన నాణేల వాడకమే అలవాటుగా ఉండేది. మనదేశాన్ని పాలించిన వివిధ రాజ్యాల రాజులంతా ఏకంగా 2,600 ఏళ్లపాటు నాణేలనే ముద్రించారు. తర్వాత ఈస్టిండియా కంపెనీ విస్తరణవాదం కారణంగా బంగారం, వెండి వంటి లోహాలకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సంక్షోభం ఏర్పడుతుందని ముందుగానే గ్రహించిన బ్రిటిషర్లు కాగితం నోట్లను తీసుకొచ్చారు. యురోపియన్‌ ట్రేడింగ్‌ కంపెనీలు కూడా 18వ శతాబ్దం సమయంలో కాగితం కరెన్సీని తెచ్చినా.. వాటికి ప్రజల్లో అధికారిక వినియోగం ఉండేది కాదు. ఈ ఏజెన్సీ హౌజ్‌ల ఆధిపత్యానికి గండి కొట్టడంతోపాటు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి 1861లో 'పేపర్‌ కరెన్సీ యాక్ట్‌' ద్వారా బ్రిటన్‌ పార్లమెంటు ఈ నోట్లను తీసుకొచ్చింది. ఇవే మనదేశంలో తొట్టతొలిగా ముద్రించిన కాగితం నోట్లు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వీటిని ముద్రించేది. (కేవలం బ్రిటిష్‌ వారివే కాకుండా.. 1890-1954 వరకు ఫ్రెంచి బ్యాంకు; 1863-1961 వరకు పోర్చుగీసు ప్రభుత్వం జారీ చేసిన నోట్లు కూడా భారత్‌లో చలామణి అయ్యేవి.) 1935లో ఏర్పాటైన రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారత నగదు నిర్వహణ బాధ్యతను తీసుకుంది. నాటి నుంచి ఆర్‌బీఐ ముద్రించిన నోట్లే చలామణి అవుతున్నాయి.

ఇవీ చదవండి: భారత్‌లోనూ శ్రీలంక పరిస్థితులు?.. జైశంకర్​ క్లారిటీ

రైల్వే మెలిక.. సర్వీస్ ఛార్జ్ తొలగించి.. అసలు ధరకు కలిపేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.