ETV Bharat / bharat

Azadi ka amrit mahotsav: భారతీయులను మహమ్మారికి వదిలేశారు!

author img

By

Published : Jan 7, 2022, 7:22 AM IST

Azadi ka amrit mahotsav: వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది.. సదుపాయాలు పెరిగి.. నెలల్లోనే టీకాలు తయారవుతున్న ఈ కాలంలోనే కొవిడ్‌లాంటివి మనల్ని ఇంతగా భయపెడుతుంటే.. మరి బ్రిటిష్‌ హయాంలో వచ్చిన స్పానిష్‌ మహమ్మారి భారత్‌లో ఎలాంటి ప్రభావం చూపింది? అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది?

British Rule
ఆంగ్లేయ ప్రభుత్వం

1918 flu pandemic in India: మొదటి ప్రపంచయుద్ధం పూర్తవగానే మానవాళిపై వచ్చి పడ్డ ఉపద్రవం.. స్పానిష్‌ ఫ్లూ! యుద్ధంలో పాల్గొని వచ్చిన సైనికులతో భారత్‌లో కూడా ప్రవేశించిన ఈ మహమ్మారి.. తొలుత నౌకాకేంద్రాలున్న పట్టణాలు.. ముఖ్యంగా ముంబయిలాంటి చోట మొదలైంది. మన దేశంలో తొలిసారిగా 1918 మేలో ముంబయిలో ఈ లక్షణాలు కనుగొన్నారు. క్రమంగా..ఇది గ్రామాలకు కూడా పాకడం మొదలైంది. "రైతు కూలీలు.. చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. రోజంతా పనే చేయలేకపోతున్నారు" అంటూ ఓ అధికారి బ్రిటిష్‌ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శించింది. ముంబయిలో 15వేల మంది మరణించారని, దిల్లీలో రోజుకు 800 మంది చొప్పున మరణిస్తున్నట్లు లండన్‌ టైమ్స్‌ ప్రచురించింది. మొత్తం మీద.. ఈ మహమ్మారి కారణంగా.. భారత్‌లో దాదాపు రెండు కోట్ల మంది మరణించినట్లు అంచనా వేశారు. ఒక్క పంజాబ్‌ రాష్ట్రంలోనే 3లక్షల మంది కన్నుమూశారు. పేదలే ఎక్కువగా బలయ్యారు. "వీధుల్లో ఎక్కడ చూసినా శవాల కుప్పలే. మరణమృదంగం మోగని ఇల్లు లేదు. రాబందులు, తోడేళ్లు రాజ్యమేలుతున్నాయి" అంటూ.. పంజాబ్‌ పారిశుద్ధ్య కమిషనర్‌ లేఖ రాశారు.

Spanish flu in India: సహజంగానే.. ప్రకృతి విపత్తుల్లో సరిగా స్పందించకుండా.. గాలికి వదిలేసే బ్రిటిష్‌ ప్రభుత్వం మహమ్మారి విషయంలోనూ దాదాపు అలాగే వ్యవహరించింది. 'అధికార యంత్రాంగం.. మానవత్వంలాటి భావోద్వేగాలతో కాకుండా.. హేతుబద్ధంగా నిబంధనలకు కట్టుబడి పనిచేయాలి' అంటూ తమ శిక్షణలో చెప్పే జర్మన్‌ సిద్ధాంతకర్త మార్క్‌ వెబర్‌ మాటల్ని తూ.చ.తప్పకుండా ఆచరించింది. 'ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్యే ఇక్కడా ఉంది ఏం చేస్తాం' అన్నట్లు చాలామటుకు ఆంగ్లేయ అధికారులు చేతులెత్తేశారు. తమ ప్రాణాలకు ప్రాధాన్యమిచ్చుకుంటూ .. భారతీయులను మహమ్మారికి వదిలేశారు. విశాలమైన భవంతుల్లో ఉన్న తమ దరికి ఫ్లూ చేరకుండా యూరోపియన్లంతా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా చేరింది. కాకుంటే.. భారతీయులతో పోల్చుకుంటే మరణాల రేటు చాలా తక్కువ.

మనవారున్న చోట మరణాలు తక్కువ

బ్రిటిష్‌ బ్యూరోక్రసీకి.. వైద్యశాఖకు మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరు కూడా ప్రజల పాలిట శాపమైంది. భారతీయ అధికారులున్న చోట మరణాలు తక్కువ నమోదుకాగా.. బ్రిటిష్‌ అధికారుల పర్యవేక్షణలోని జిల్లాలో ఎక్కువ మరణాలు చోటు చేసుకోవటం గమనార్హం. భారత్‌లో ఆంగ్లేయ యంత్రాంగం స్పందనపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఓ అధ్యయనం నిర్వహించింది. ఆంగ్లేయ అధికారుల పర్యవేక్షణలో ఉన్న జిల్లాలతో పోలిస్తే... భారతీయులు కలెక్టర్లుగా, డాక్టర్లుగా ఉన్న ప్రాంతాల్లో 15శాతం తక్కువగా మరణాలు నమోదైనట్లు ఈ పరిశోధన తేల్చింది. అంతేగాకుండా... "బ్రిటిష్‌వారితో సమానంగా పోటీపడి వివక్షలు ఎదుర్కొంటూ పరీక్షలో పాసైన భారతీయ అధికారులు తమ తెల్ల సహచరులకంటే ఎంతో సమర్థులు. అర్హతల్లో తేడా లేకున్నా సామర్థ్యంలో ఉంది" అంటూ ఆ పరిశోధన తేల్చింది. మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయ నిధులు విడుదల చేయటంలో కూడా ఆంగ్లేయ అధికారులు పిసినారిగా వ్యవహరించగా... భారతీయ అధికారులు అదనంగా విడుదల చేశారు. "చలికాలంలో చిరుజల్లులు పడితే అంతా మెరుగవుతుంది. పరిస్థితి తనంతటతానే సర్దుకుంటుంది" అంటూ ఓ ఆంగ్లేయ ఉన్నతాధికారి వ్యాఖ్యానించాడు. "అత్యంత దారుణమైన మహమ్మారి సమయంలో భారత్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వం వ్యవహరించినట్లుగా... బహుశా నాగరిక ప్రపంచంలో మరే ప్రభుత్వమూ తమ ప్రజల్ని ఇలా గాలికి వదిలేయదు" అంటూ గాంధీజీ యంగ్‌ ఇండియాలో ఆక్షేపించారు.

ఇదీ చూడండి: Azadi ka amrit mahotsav: ఐక్య భారత్​ ఆగిందిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.