పొలాలను పశువులకు మేపుతున్న రైతులు - కన్నీళ్లు మిగిల్చిన కరవుపై చోద్యం చూస్తున్న ప్రభుత్వం
YSRCP Government Not In Farmers Drought Losing Crops: ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు నిండా ముంచడంతో సాగునీరందక ఎండిన వరి పంటను పశువులకు మేతగా వినియోగిస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో వరి చేలు ఎండిపోయి వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 11 నియోజకవర్గాల పరిధిలో 16 వేల ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. 50వేల ఎకరాలకు పైగా పంట ఎండిపోయి ఉంటుందని అనధికారికంగా అంచనా వేసినట్లు అధికారులు చెబుతున్నారు.
కొన్ని చోట్ల వెన్ను వేయకముందే పంట ఎండిపోగా మరికొన్నిచోట్ల వెన్ను సమయంలో దెబ్బతిని పొల్లు గింజలు తయారయ్యాయని రైతులు అంటున్నారు. వరుణుడు కరుణిస్తాడని ఆశపడ్డ రైతులకు నేటికీ నిరాశే మిగలడంతో ఎండిన వరి పంటను పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. ఎకరాకు సమారు 50వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని అన్నదాతలు వాపోతున్నారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు కరవు మండలాలు ప్రకటించడంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలకు తీవ్ర అన్యాయం చేసిందని రైతులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పంట ఎండిపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.