రోడ్లు, విద్యుత్ లేకుండా ఎన్ని తరాలు ఈ డోలీ బతుకులు - ఆదివాసీల ర్యాలీ ! అడ్డుకున్న పోలీసులు
Tribals Protest in Visakha: విశాఖలో ఆదివాసీలు వినూత్నరీతిలో నిరసనకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాగడాలు చేతబట్టి, నెత్తిన అడ్డాకుల టోపీలు పెట్టి డోలి మోస్తూ ఆందోళనకు దిగారు. అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లా సరిహద్దు గ్రామం జాజులు బంధ గ్రామస్థులు.. తమ వేదనను, జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు జిల్లాపరిషత్ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన వారిని పోలీసులు నిలువరించారు. ర్యాలీకి అనుమతి లేదని వివరించారు. జిల్లా పరిషత్ అధికారులను కలిసేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తామన్న పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
అసలు వారు నిరసనకు ఎందుకు దిగాల్సి వచ్చింది: వారి గ్రామంలో రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయిందని.. పలుమార్లు జిల్లాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లభించలేదని వారు వారు వాపోయారు. అత్యవసర సమాయల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. గర్భీణీలను కిలోమీటర్ల దూరం డోలిలో మోసుకువెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరి మండలంలో బూరిగ, చిన్న కొనల పరిసర గ్రామాల్లో సుమారు పది గ్రామాలకు ఇప్పటివరకు.. విద్యుత్ సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవేకాక ఇంకా అనేక సమస్యలు వారి గ్రామాల్లో నెలకొన్నాయి వారు ఆందోళనకు దిగారు.