గోరంట్ల బుచ్చయ్య పీఏపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి - రోడ్డుపై బైఠాయింపు, కూడలిలో ఉద్రిక్తత
Traffic Constable Attack on Gorantla Butchaiah Chowdary PA : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చంద్రశేఖర్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ దాడి చేశాడు. ఈ దాడిని ఖండించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కానిస్టేబుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ వైఖరిపై తెలుగుదేశం, జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. దాడిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో స్థానిక రామాలయం కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. బాధితున్ని ఆసుపత్రికి తరలించిన అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.
Nara Lokesh React on Constable Attack Butchaiah Chowdary PA Issue : గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చంద్రశేఖర్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు సీఎం జగన్ (CM Jagan) ప్రైవేటు సైన్యంలా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. చంద్రశేఖర్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేసి తల పగులగొట్టడం దారుణమని మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీ తొత్తులుగా మారి చట్టవిరుద్ధంగా ఇలా దాడులకు పాల్పడితే ప్రజలకు దిక్కెవరని ప్రశ్నించారు. అరాచకశక్తుల మాయలో పడి చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులు.. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రశేఖర్‌కు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.