Tomato Price Falling Heavily in Nandyal District: పడిపోయిన టమాటా ధరలు.. రోడ్లపై పారబోసిన రైతులు
Tomato Price Falling Heavily in Nandyal District: కొన్ని రోజుల క్రితం వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన టమాటా.. ప్రస్తుతం ధర లేక నేలచూపులు చూస్తోంది. మొన్నటి వరకు.. కిలో 200 రూపాయల వరకు పలికిన టమాటా ధర.. ఇవాళ 3 రూపాయలకు పతనమైంది. నిన్న మొన్నటి వరకూ టమాటాల పేరు చెబితేనే వణికిపోయిన సామాన్యులకు ఇది ఊరటనిచ్చే అంశం కాగా.. రైతులకు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అప్పులు చేసి మరీ టమాటా సాగుపై పెట్టుబడులు పెట్టగా.. ఇప్పుడు కనీస మద్దతు ధర రాకపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
గిట్టుబాటు కావట్లేదంటూ.. నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై, ప్యాపిలి మార్కెట్ వద్ద రైతులు టమోటాలను పారబోసి వెళ్లిపోయారు. కుప్పలుగా ఉన్న టమాటాలను ఆవులు, గొర్రెలు తింటున్నాయి. పంటను కోసి మార్కెట్కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు.