Anam Venkata Ramana Reddy on Jagan: పరువు పోతుంది వద్దు అక్కా అని విడదల రజినీ బతిమాలినా రోజా వినలేదు: ఆనం

By

Published : Jun 30, 2023, 7:36 PM IST

Updated : Jul 1, 2023, 7:56 AM IST

thumbnail

TDP spokesperson Anam Venkata Ramana Reddy: రాష్ట్రంలో జరిగే మద్యం వ్యాపారంలో ప్రతీ రూపాయి జగన్ కుటుంబానికే వెళ్తోందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. మద్యం వ్యాపారం మొత్తం వైఎస్ కుటుంబానిది కాబట్టే.. ఎన్ని ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నా ఒక్క విచారణా జరగలేదన్నారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి నేటి వరకూ లక్ష కోట్ల మద్యం అమ్మిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దానిని నిజమని నమ్మించే సత్తా జగన్​కే ఉందన్న ఆనం.. మద్యం అమ్మకాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నందుకు అభినందించాలో, సిగ్గుపడాలో కూడా అర్థం కావట్లేదన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే మద్యం అమ్మకాలు లక్ష కోట్లు ఉంటే, డిజిటల్ చెల్లింపులు లేకుండా జరిపిన అనధికారిక అమ్మకాల మొత్తం ఇంకెంతో అని నిలదీశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా వస్తున్న 2వేల నోట్లలో పెద్ద కుంభకోణం ఉందని మండిపడ్డారు. 2వేల నోట్లు రద్దు కాగానే రూ.1400 కోట్ల అమ్మకాలు పెరిగాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మొత్తం బాగోతం బయటపడుతుందని తెలిపారు. 'జగనన్న మద్యం వద్దు, మన ప్రాణం ముద్దు' అనేది ప్రజల నినాదం కావాలని కోరారు. ఏపీలో వైద్య సదుపాయాలకు భయపడే.. రోజా చెన్నై ఆసుపత్రిలో చేరారని విమర్శించారు. పరువు పోతుంది.. ఏపీలో వైద్యం చేయించుకో అక్కా అని విడదల రజిని బతిమాలినా రాష్ట్రంలో వైద్యానికి రోజా సాహసించలేదన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టారనే భయం రోజాలో ఉన్నందుకే చెన్నైలో వైద్య సేవలు ఆశ్రయించిందని ఆక్షేపించారు. ఏపీ మద్యం తాగే రాకేశ్ మాస్టర్ చనిపోయారని ఆరోపించారు.

Last Updated : Jul 1, 2023, 7:56 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.