5వేల కోట్ల రూపాయల సిలికాను దోచేశారు - నెల్లూరు జిల్లాలో అక్రమ తవ్వకాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ
TDP Leaders Complain to Tirupati Collector About Silica Mining: కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచేస్తున్నారని టీడీపీ పొలిట్‍బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సిలికా అక్రమ తవ్వకాలు, దొంగ ఓట్ల వ్యవహారాలపై తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డికి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, సొనకాలువలు, అటవీ భూముల్లో అక్రమ సిలికా శాండ్ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికి 3 వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల రూపాయల దోపిడి జరిగిందన్నారు. ఇంత అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
అధికారులు స్పందించకపోతే 15 రోజుల్లో కోర్టును ఆశ్రయిస్తామనని సోమిరెడ్డి తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే సిలికా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామన్నారు. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి వాటాలు అందుతున్నాయన్నారు. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించారని.. చనిపోయిన వారి ఓట్లను కొనసాగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఓటర్ల లిస్టుల్లో మార్పులు చేసే దాకా పోరాడతామన్నారు.