గన్నవరంలో టీడీపీ నాయకుడి దుకాణాలు కూల్చివేత.. ముఖానికి మాస్కులు ధరించి..

By

Published : Jun 6, 2023, 7:50 PM IST

thumbnail

TDP Leader Shops Demolished: తెలుగుదేశం పార్టీ గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు పొలంలో నిర్మించిన దుకాణ సముదాయాన్ని పోలీసులు, పంచాయతీ సిబ్బంది సాయంతో రెవెన్యూ శాఖాధికారులు సోమవారం కూల్చివేత చర్యలు చేపట్టారు. గన్నవరం మండలంలోని వెదురుపావులూరులోని సర్వే నెం 308-4లో 0.99 సెట్లకు 1998లో అప్పటి ప్రభుత్వం.. జాస్తి రాజేశ్వరమ్మకు డీ ఫారం పట్టా ఇచ్చింది. వారసత్వంగా ఆమె కుమారుడు జాస్తి వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఆ పొలాన్ని సాగు చేస్తున్నారు. ఇటీవల గన్నవరంలో వైసీపీ, టీడీపీ అల్లర్ల అనంతరం సదరు భూమి.. ప్రభుత్వానిదంటూ రెవెన్యూ అధికారులు ఫిబ్రవరి26న ప్లెక్సీ ఏర్పాటు చేశారు. 'వెదురుపావులూరు శివారు ముస్తాబాద రీసర్వే నెం:308 ప్రభుత్వ భూమి. దీన్ని ఆక్రమించినవారు శిక్షార్హులు' అని అందులో పేర్కొన్నారు. 

దీంతో వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ.. స్పందనలో ఫిర్యాదు అందిందని గన్నవరం ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో ఇటీవల నివేశన స్థలాల అన్వేషణ పేరిట సదరు భూమిని మే 18న పరిశీలించారు. ప్రభుత్వ భూమి అని తేలితే సత్వరమే, అందులో అక్రమ నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. దీనిపై రీసర్వే చేపట్టిన అధికారులు.. ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో సోమవారం కూల్చివేత చర్యలు చేపట్టారు. దుకాణ సముదాయంతో పాటు పంట పొలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఐ ఉదయ్ తెలిపారు. అయితే కూల్చివేతల పర్వంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. కూల్చివేతలు చేపడుతున్న అధికారులు తమ ముఖాలను కనిపించనీయకుండా మాస్కులు ధరించారు. మహిళా సిబ్బంది నుంచి జేసీబీ డ్రైవర్​ సహా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించారు. దీనిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.