జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో నచ్చిన వారికి దోచిపెడుతున్నారు : పట్టాభిరామ్
TDP Leader Pattabhi Ram Shocking Comments on Jagan: జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజలసొమ్ము దోచిపెడుతున్నాడని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. వారు దోచుకోవడానికి వీలుగా ముఖ్యమంత్రి గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నాడని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఫైనాన్షియల్ రూల్స్ కు విరుద్ధంగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫలానా తేదీన మీకు చెల్లింపులు చేస్తామని అడ్డగోలుగా తమకు నచ్చిన సంస్థలకు గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. మెగా ఇంజినీరింగ్ సంస్థకు జగన్ సర్కార్ ఇప్పటికే 255కోట్ల చెల్లింపులకు సంబంధించి 7 గ్యారెంటీ లెటర్స్ మంజూరు చేసిందని పట్టాభి వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు చేస్తామని చెబుతూ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ లెటర్స్ తీసుకొని కాంట్రాక్ట్ సంస్థలు నేరుగా రుణాల కోసం బ్యాంకుల్ని ఆశ్రయిస్తున్నాయని తెలిపారు.
2024 బడ్జెట్ ప్రవేశపెట్టకుండా.. శాఖల వారీగా కేటాయింపులు జరగకుండా ఫైనాన్షియల్ నిబంధనలు.. బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఇలా ఎలా గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారో పిట్టకథల మంత్రి బుగ్గన చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించలేని జగన్ రెడ్డి తనకు నచ్చినవారికి గ్యారెంటీ లేఖలు ఇస్తూ దోపిడీకి తెగబడుతున్నాడని పట్టాభిరామ్ దుయ్యబట్టారు. అయినవారికి దోచిపెట్టేందుకు రూల్స్ కు విరుద్ధంగా గ్యారెంటీ లేఖలు ఇస్తున్న జగన్ సర్కార్... ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్న అనేక పథకాలు.. పనులకు మాత్రం వేలకోట్లు బకాయిపెట్టి, రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.