Pattabhi On Capital Lands: రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దగా: పట్టాభి
Published: May 18, 2023, 5:39 PM

Pattabhi Comments On Capital Lands: రాజధానిలో ఇళ్ల స్థలాలపేరుతో పేదల్ని దగా చేస్తూ జగన్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపాడని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరించిన మొత్తం భూమిలో పేదవాడి గృహ నిర్మాణానికి కేటాయించాలని 2014 డిసెంబర్ 30న చట్టంలో పొందుపరిచారని ఆయన గుర్తు చేశారు.
ఇళ్లస్థలాల పేరుతో చిత్తు కాగితంతో సమానమైన పట్టాలను సీఎం జగన్ పేదలకు ఇస్తున్నాడనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధానిలో ఎలాంటి లిటిగేషన్లు లేని చట్టబద్ధమైన భూమిని పేదలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి కోర్టు వివాదాల్లో ఉన్న భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇవ్వడం పేదల్ని వంచించడం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు లేనటువంటి ఒక పట్టా, చిత్తు కాగితంతో సమానమైనటువంటి పట్టా పేదవాడికి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం.అమరావతిలో 5 శాతం భూమిని పేదలకు కేటాయిస్తూ 2014 డిసెంబర్లోనే చంద్రబాబు చట్టం చేశారు. అమరావతి ఒక శ్మశానం, ముంపు ప్రాంతం, మీ దృష్టిలో రాజధాని కాని ప్రాంతంలో నేను రాజధానిలో పేదవాళ్లకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నా అని ఎలా అంటారు..?- కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ అధికార ప్రతినిధి