వైసీపీ నేతల మట్టి దోపిడీపై అధికారుల ఉదాసీనత! విప్ అండదండలతోనే తవ్వకాలన్న టీడీపీ నేత కాలవ
TDP Leader Kaluva Srinivas comments on YCP: అనంతపురం జిల్లా రాయదుర్గం శివారు ప్రాంతం నాన్ చెరువులో వైసీపీ నేతలు యథేచ్ఛగా సహజ వనరులను దోపిడీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్.. కాపు రామచంద్రారెడ్డి అండదండలతో రాయదుర్గం వైసీపీ నేత బోర్వెల్ నాగిరెడ్డి.. ఇష్టారీతిన ఇసుక, మట్టిని తవ్వేస్తున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాలవ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం సెలవు దినం.. పైగా దీపావళి పండుగ అధికారులు ఎవరూ లేకపోవడంతో వైసీపీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడ్డారని కాలవ ఆరోపించారు. దాదాపు 25 ట్రాక్టర్లు, రెండు జేసీబీలతో మట్టి తవ్వకాలకు తెరలేపారని పేర్కొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో అధికారులందరూ ఇళ్లకు పరిమితం కావడంతో పథకం ప్రకారం మట్టి దోపిడీకి పాల్పడ్డారని వెల్లడించారు. పట్టపగలు మట్టి దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ఉదాసీనతగా వ్యవహరిస్తుందంటూ కాలవ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. అక్రమంగా మట్టి త్రవ్వకాలపై శ్రీనివాసులు రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూబకాసురులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.