వైసీపీ సర్కారు ప్రతి స్కీమ్ - స్కామే! పోలీసుల సాయంతో విపక్షాలు, ప్రజల గొంతుకను అణిచివేస్తున్నారు: నాదేండ్ల
Published: Nov 18, 2023, 3:17 PM

TDP Alapati Rajendra Prasad Fire on CM Jagan: వైసీపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కలిసికట్టుగా ఎదుర్కొందామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో రెండు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో కలిసి పని చేస్తున్నారు. తెనాలి మండలం గుడివాడలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి పర్యటించారు. ''బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ'' కార్యక్రమంపై కరపత్రాలను పంచారు.
ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కేసుల్లో సాక్ష్యాలు చూపలేక సీఐడీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేసి జైలులో ఉంచే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకంలోనూ అవినీతి దాగి ఉందని విమర్శించారు. వైసీపీ అక్రమాలకు పాల్పడుతూ పోలీసుల సాయంతో విపక్షాలు, ప్రజల గొంతు నొక్కేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలను గమనించే తమ నేత పవన్ కల్యాణ్ వైసీపీని గద్దె దించాలనే ఆలోచనతోనే టీడీపీతో జట్టు కట్టారని ప్రజలకు వివరించారు.