సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు
Superstar Krishna First Death Anniversary Celebrations : సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి కార్యక్రమం బాపట్ల జిల్లా చీరాలలో ఘనంగా నిర్వహించారు. కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభం కూడలిలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారం అందచేశారు. సూపర్ స్టార్ అభిమానులు మాట్లాడుతూ.. మన నుంచి సూపర్ స్టార్ దూరమై నేటికి సంవత్సరం గడిచి పోయింది. అయినా ఆయనపై ఏ మాత్రము అభిమానం తగ్గలేదు.. ఆయన మృతిని రాష్ట్రం నలుమూలల ఉన్న అభిమానులు నేటికి జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి గుర్తుండిపోయే పేరు సూపర్ స్టార్ కృష్ణ. సినీ పరిశ్రమలో తాను నటించిన చిత్రాలలో విభిన్నమైన పాత్రలు వేసి ప్రజలలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రకారకాల పాత్రలతో అలరించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఘట్టమనేని శివరామకృష్ణగా మెుదలు పెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయంగా మారిందన్నారు. ఇంతటి మహానీయుడు మరణించి నేటితో ఏడాది అయిన సందర్భంగా అభిమానులు పలుచోట్ల ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.