ఎనిమిది నెలలుగా జీతాలు బంద్, పండుగనాడూ పస్తులే - వాహనాలను నిలిపేసి ఆందోళనకు దిగిన 'క్లాప్' డ్రైవర్లు
Sanitation Workers Protest for Salaries in Anantapur: స్వచ్ఛంద కార్పోరేషన్.. పేరు ఘనంగా ఉంది. ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరిస్తామని, ఇది చాలా బృహత్తర కార్యక్రమంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు వేదికలమీద చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం గృహాల నుంచి నెలకు 60 రూపాయలు కూడా చెత్త పన్ను వసూలు చేస్తోంది. చెత్త పన్నుపై గృహ యజమానుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైనా.. ప్రభుత్వం లెక్కచేయలేదు. చివరకు కాలనీల్లో ఖాళీ స్థలాలను కూడా వదలకుండా ఆ స్థలాల యజమాని వివరాలు కనుక్కొని నెలకు 60 వసూలు చేస్తున్నారు. కానీ ఈ కార్పోరేషన్లో అత్యంత తక్కువ వేతనానికి పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు మాత్రం ఇవ్వటంలేదు.
నెలల తరబడి వేతనాలు లేకపోయినా అనంతపురం నగరపాలక కమిషనర్ భాగ్యలక్ష్మి కనీసం వారికి ఇతర నిధుల నుంచైనా పండుగ ఖర్చులకు ఇప్పించే చర్యలు తీసుకోలేదు. వేతన బకాయిలపై పట్టించుకోని అనంత నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ నగరంలోని 50 డివిజన్లలో చెత్త సేకరణచేసే 47 వాహనాలను కార్మికులు నిలిపివేసి, సమ్మె చేస్తున్నారు. వేతన బకాయి దసరాకు చెల్లిస్తామన్న గుత్తేదారు, దీపాళి నాటికి కూడా ఇవ్వలేదు. కడప జిల్లాకు చెందిన గుత్తేదారుడు రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో క్లాప్ వేతనం బకాయి పడ్డాడని కార్మికులు చెబుతున్నారు. వేతనాలు ఇవ్వక పోవటంతో కుటుంబాలను పస్తు పెట్టాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.