'చేయని నేరం ఒప్పుకోమన్నారని' - పోలీస్ స్టేషన్ బాత్రూంలో ఫినాయిల్ తాగిన యువకుడు
Police Beat the Young Man to Theft Case in Anantapur District : పోలీసుల దెబ్బలు తట్టుకోలేక స్టేషన్ బాత్రూంలోని ఫినాయిల్ తాగి ఓ యువకుడు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అల్లీపీరా కాలనీకి చెందిన చైతన్య అనే యువకుడు... మహేశ్ అనే వ్యక్తి వద్ద బైక్ కొనుగోలు చేశాడు. ఆ బైక్ చోరీ చేసిందని అనుమానించిన వజ్రకరూరు పోలీసులు.. చైతన్యతో పాటుగా ఖాజా, కిరణ్‌ను బైక్ దొంగతనం చేసిన కేసులో విచారణ ఉందంటూ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి చితకబాదారు.
తమ పిల్లలు చోరీ చేయకపోయినా.. కేసు ఒప్పుకోవాలంటూ వజ్రకరూర్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చితకబాదారని బాధితుల తల్లిదండ్రులు తెలిపారు. ఖాజా అనే యువకుడు పోలీసుల దెబ్బలు తట్టుకోలేక స్టేషన్ బాత్రూంలోని ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు ఖాజాను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఖాజా పరిస్థితి విషమంగా ఉంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.