దళిత యువకుడు బొంతు మహేంద్రది ప్రభుత్వ హత్యే - న్యాయం జరిగే వరకూ పోరాటం తప్పదు : జడ శ్రావణ్ కుమార్
Jada Shravan on Dalit Youth Mahendra Suicide: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు బొంతు మహేంద్రది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ ఆరోపించారు. పోలీసుల వేధింపులతోనే మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు దళితుల సత్తా ఏంటో చూపిస్తామని జడ శ్రావణ్ హెచ్చరించారు.
Jada Shravan Comments: ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు బి.మహేంద్ర మృతిపై జడ శ్రావణ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..''పోలీసుల వేధింపుల కారణంగానే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దళిత యువకుడు మహేంద్రది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. జగన్ ప్రభుత్వం దళితులపై కక్షగట్టింది. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు దళితుల సత్తా ఏంటో చూపిస్తాం. వైసీపీ నయవంచన యాత్రపై రేపు సమావేశం నిర్వహిస్తాం. హోంమంత్రి తానేటి వణితను గ్రామస్థులు ఘెరావ్ చేశారు. జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకే కాదు.. మైనారిటీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు కూడా రక్షణా లేకుండా పోయింది. దళితులపై దాడులు జరుగుతుంటే.. దళిత మంత్రులు, దళిత నాయకులు ఏం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన దళితుల హత్యలు, ఆత్మహత్యలపై న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తాం.'' అని ఆయన అన్నారు.