ముందు అక్రమం అన్నారు, ఆ తర్వాత సక్రమమే అంటూ వదిలేశారు!
Illegal Sand Transportation in YSR District : వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. విషయం తెలుసుకున్న కమలాపురం తహసీల్దార్ సరస్వతి మొదటగా నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మిగతా వాటి వద్ద అనుమతులు ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవడానికి నేరుగా ఇసుక క్వారీ వద్దకు వెళ్లారు. అటుగా వచ్చిన ఆరు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని వాటిని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు.
అలాగే.. వీరపునాయుని పల్లె తహసీల్దారు కూడా ఇసుక క్వారీ వద్దకు పరిశీలించడానికి వెళ్లారు. 'ఈటీవీ భారత్' ఆయనను వివరణ కోరేందుకు సంప్రదించింది. తాను సంగమేశ్వర ఆలయాలలో పూజలు నిర్వహించడానికి వచ్చినప్పుడు కమలాపురం తహసీల్దార్ తనను క్వారీ వద్దకు రమ్మన్నారని, మిగిలిన విషయాలు తనకు తెలియదన్నారు. సాయంత్రం సమయానికి.. అక్రమం అని పట్టుకున్న పది ఇసుక ట్రాక్టర్లను సక్రమమేనని అధికారులు పంపించటంతో స్థానికులు విమర్శిస్తున్నారు. అంతేగాక జేపి సంస్థ పేరుతో బిల్లులు ఇచ్చి యథావిధిగా ఇసుకను తరలిస్తున్నారు.