Former Vice President Venkaiah Naidu: మాతృభాష వల్లే నిజమైన భావ వ్యక్తీకరణ: వెంకయ్యనాయుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 10:51 PM IST

thumbnail

Former Vice President Venkaiah Naidu:  వీలునామా రాయాల్సిన అవసరం లేకుండా తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి తెలుగు పద్యమని- పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పద్యం తెలుగుదనానికి ప్రతీక అని.. కంఠస్థం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో విద్యార్ధులతో నిర్వహించిన ద్వి సహస్ర గళ పద్యార్చన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. 

నన్నయ భారతంలోని 108 పద్యాలను 36 నిమిషాల వ్యవధిలో రెండు వేల మంది విద్యార్ధులు సామూహికంగా ఆలపించిన ద్విసహస్ర గళ పద్యార్చనను ప్రత్యక్షంగా తిలకించి నిర్వాహకులు, విద్యార్ధులను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సాధన ఇక్కడితో ఆగి పోరాదని.. భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలన్నారు. నిజమైన భావ వ్యక్తీకరణ, ప్రగతి, మాతృభాష వల్లే వస్తుందని చెప్పారు. పరభాషా, సంస్కృతుల వ్యామోహాలలో పడి కొట్టుకుపోవద్దని వారించారు. తెలుగు పద్యం అంత మనోజ్ఞమైందీ, మధురమైందీ, సుందరమైనదీ మరే భాషలో లేదన్నారు. శ్రీమదాంధ్రమహాభారతం అవతరించి వెయ్యేళ్లు కావడం, రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం విజయవాడ ప్రాంతంలో వెయ్యేళ్ల క్రితం ఆగస్టు 22న జరిగిందని.. వెలుగులోకి వచ్చిన విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పారు. పొట్టిపొట్టి పదాలతో పేర్లను కుదించడం - మార్పు చేయడాన్ని వెంకయ్యనాయుడు తప్పుపడుతూ.. తెలుగు వెలుగును అందిస్తుందంటూ తనదైన శైలిలో ప్రసంగించి విద్యార్ధులను ఉత్తేజితులను చేశారు. 

ఎంతో కర్ణపేయంగా, వీనుల విందుగా.. విద్యార్థుల ద్విసహస్రగళ పద్యార్చన ఉందని.. ఈ మధురఘట్టం అద్భుతమని వెంకయ్యనాయుడు  కొనియాడారు. భాష ప్రయోగాలతో సాహిత్య పిపాసను కొనసాగించాలని.. ఇది అనేక భాషలు నేర్చుకునే శక్తి సామర్ధ్యాలను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు. అనేక భాషల్లో లేని విశిష్టత తెలుగు భాషలో ఉందన్నారు. కావ్యభాషకు నీరాజనం పద్యమని పేర్కొన్న ప్రవచనరక్త, సహస్రావధాని పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు.. ఆధునిక తరానికి ఆదికవి సందేశం అనే అంశంపై నన్నయ్య పద్యాలనే ఉదాహరణలుగా వివరించారు. 

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.