విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన 40 బోట్లు

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 6:35 AM IST

thumbnail

Fire Accident in Visakhapatnam: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొదట ఒక బోటు దగ్గర మొదలయ్యిన మంటలు.. కొద్దిక్షణాల్లోనే పక్కన ఉన్న బోట్లకు వ్యాపించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో బోట్లు దగ్ధమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించారని స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 40 పైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోర్టు అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ పోస్ట్ అథారిటీ నుంచి ప్రత్యేక అగ్నిమాపక నౌకను మంటలార్పేందుకు అధికారులు రప్పించారు. ప్రమాద సమయంలో బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే బోటుకు నిప్పంటించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో లక్షల్లో ఆస్తినష్టం సంభవించిందని బోటు యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సుమారు 25 నుంచి 30 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కొన్ని బోట్లు వేట ముగించుకుని ఫిషింగ్‌ హార్బర్‌కు రాగా.. మరికొన్ని బోట్లు ఇంధనం నింపుకుని వేటకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ సమయంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అమ్మకానికి సిద్ధంగా మత్య్స సంపద అంతా బూడిదపాలైందని బోటు యజమానులు, కళాసిలు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.