CPI RamaKrishna Fire on CM Jagan రాజకీయ నాయకుడిలా సీఐడీ చీఫ్ మాట్లాడటం ఏమిటి?.. ఈ నెల 17,18 సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశాలు: సీపీఐ రామకృష్ణ
CPI RamaKrishna Fire on CM Jagan : ప్రజాస్వామ్యంలో ఉన్నామో, సీఎం జగన్ నియంత్రత్వ పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నిర్మాణ మహాసభలో పాల్గొన్న ఆయన కేంద్ర, ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల మూడు నెలల జగన్ పాలనలో కక్షపూరిత రాజకీయాల తప్ప సాధించింది ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వడ్డీలు కట్టేందుకు ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ రాకపోగా, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని తెలిపారు.
మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను గాలికి వదిలేసారని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరదలొచ్చి గేటు కొట్టుకుపోతే, ఆ గేటు పెట్టేందుకు రెండు కోట్లతో ఆరుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోవడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు తప్పు చేసుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా, అధికారం, పోలీసులు చేతుల్లో ఉన్నారని అడ్డగోలుగా ప్రవర్తించడం అన్యాయమన్నారు. చంద్రబాబును చూసేందుకు ఆయన భార్య భువనేశ్వరి జైలుకు వెలితే అనుమతి ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
CPI Round Table Meeting on September 17 and 18 in AP:సీఐడీ చీఫ్ రాజకీయ నాయకుడిలా మీడియా సమావేశాలు పెడుతూ తిరగడం ఏమిటని ప్రశ్నించారు. పది లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం కోసం తిరుగుతుంటే పట్టించుకోని సీఐడీ, ఎలాంటి ఫిర్యాదు లేని మార్గదర్శికి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యానికి జరుగుతున్న హానిపై ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.