వ్యాపారుల ఫిర్యాదుతో విజయవాడ వస్త్ర దుకాణ యజమాని అరెస్ట్ - 14 రోజుల రిమాండ్
Complaints of Silk Saree Traders in Dharmavaram : విజయవాడకు చెందిన వస్త్ర దుకాణ యజమాని అవినాష్ గుప్తాను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 23 మంది పట్టుచీరల వ్యాపారులకు.. అవినాష్ గుప్తా కోటి రూపాయలు బాకీ ఉన్నారని వ్యాపారులు ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు గుప్తాను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
అవినాష్ గుప్తాను అరెస్టు చేయటం కోసం ధర్మవరం పోలీసులు ప్రత్యేకంగా విజయవాడకు వెళ్లి అరెస్టు చేసి ధర్మవరంకి తీసుకొచ్చారు. ధర్మవరం పోలీస్ స్టేషన్లో అవినాష్ గుప్తాపై ఇప్పటికే ఐదు కేసులు నమోదయ్యాయి. అంతేకాక మరో 12 ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ తెలియజేశారు. అనంతరం నిందుతుడిని ధర్మవరం కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. కోర్టు తీర్పు వెలువరిస్తూ.. అనినాష్ గుప్తాకు 14 రోజులు రిమాండ్కు ఆదేశించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.