ధర్మవరంలో భారీ భూపందేరం - తహసీల్దార్‌కు కలెక్టర్​ షోకాజ్ నోటీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 3:32 PM IST

thumbnail

Collector Show Cause Notice to Dharmavaram MRO: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి భారీ భూపందేరానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భూ పంపిణీ పేరుతో గత ప్రభుత్వాలు పేదలకు పంచిన 411 ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు సాగు చేసుకుంటున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. 11 గ్రామాల్లో ఉన్న 411 ఎకరాల ప్రభుత్వ భూముల్లో 190 మందికి సాగు పట్టాలు ఇవ్వాలంటూ కలెక్టర్‌కు తహసీల్దార్ యుగేశ్వరిదేవి ప్రతిపాదనలు పంపడంతో అసలు విషయం బయటపడింది.

జరిగిన సంఘటన ఇది: ధర్మవరం మండలం రేగాటిపల్లి, కుడుతూరు, చిగిచెర్ల, ఏలు కుంట్ల బత్తలపల్లి మండలం అపరా చెరువు, దంపెట్ల, మాల్యవంతం ఓబులాపురం తదితర గ్రామాల్లో పేదలకు గత ప్రభుత్వాలు భూములు ఇచ్చాయి. అయితే, ఆ భూముల్లో సాగు లేకపోవడం, ఇతరులకు విక్రయించడం వంటి కారణాలతో కొందరి నుంచి ప్రభుత్వం భూముల్ని వెనక్కి తీసుకుంది. అదే అదునుగా చేసుకున్న వైసీపీ నాయకులు ఆ భూములపై కన్నేశారు. తహసీల్దార్ యోగేశ్వరీదేవితో కలిసి ప్రణాళిక అమలు చేశారు. గతంలో అసైన్డ్ చేసిన భూములను సాగుపట్టాలకు ప్రతిపాదనలు పంపొద్దని సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలున్నా వాటిని లెక్కచేయకుండా 11 గ్రామాల్లోని 411 ఎకరాల ప్రభుత్వ భూముల్లో 190 మందికి సాగుపట్టాలు ఇవ్వాలంటూ కలెక్టర్‌కు తహసీల్దార్ ప్రతిపాదనలు పంపారు. అయితే, సర్వే నెంబర్లలో చాలా వరకు గతంలో పేదలకు కేటాయించిన భూములున్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు గుర్తించారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 10 రోజుల్లో లిఖితపూర్వక సమాధానమివ్వాలని తహసీల్దార్ యోగేశ్వరీదేవికి ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.