జూపూడి వ్యాఖ్యలపై భగ్గుమన్న బ్రాహ్మణ సంఘాలు - ఆందోళన తప్పదని హెచ్చరిక
Brahmin communities Strong Counter to Jupudi Prabhakar Rao: వైసీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ నేత జూపూడి ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి బస్సు యాత్ర సంర్భంగా జూపూడి మాట్లాడిన తీరు హేయనీయమని బ్రాహ్మణ సంఘాల నేతలు పేర్కొన్నారు. బ్రాహ్మణులపై వ్యాఖ్యలు చేసిన జూపూడిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లాలో బ్రహ్మణ సంఘాలు సమావేశం నిర్వహించాయి.
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర సమావేశంలో జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం చేపట్టి సంక్షేమ కార్యక్రమాల వల్ల బ్రాహ్మణులు బూట్ల కొలతలు తీసుకునే స్థాయికి వచ్చినట్లు జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రాహ్మణ సంఘాల నేతలు, తమ కులాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న మీటింగ్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఒక్కరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూపూడి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. చదువుకొని, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై... సీఎం జగన్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.