ETV Bharat / state

రెచ్చిపోయిన వైసీపీ లీడర్​.. భూఆక్రమణకు యత్నం.. ఎదురు తిరిగి తరిమికొట్టిన బాధితులు

author img

By

Published : Mar 9, 2023, 7:47 PM IST

YSRCP leaders in land dispute: వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గుండాపురంలో భూములు ఆక్రమించుకోవడానికి యత్నించిన వైకాపా నాయకులపై.. పేద ప్రజలు తిరగబడ్డారు. 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలాన్ని ఆక్రమించి కంచె వేసేందుకు వైకాపా నాయకులు యత్నించగా.. బాధితులు కారంపొడి చల్లి తరిమికొట్టారు.

YSRCP leaders in land dispute
గుండా ఇజం

YSRCP leaders in land dispute: వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నిత్యం ఏదో ఒకచోట భూఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. వారి ఆగడాలు భరించలేక బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడం వల్ల ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్​ సొంత జిల్లాలో ఇలాంటి ఘటనే జరగగా.. బాధితులు ఊరుకోలేదు... తిరగబడ్డారు.. వైసీపీ నాయకులు కళ్లలో కారం చల్లి తరిమి తరిమి కొట్టారు. కానీ ఇది జీర్ణించుకోలేని ఆ నాయకుల అనుచరులు ఆ కుటుంబానికి చెందిన ఇంటిపై దాడికి పాల్పడి.. ధ్వంసం చేశారు. పోలీసులను ఆశ్రయించినా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గుండాపురంలో బత్తల సిద్ధయ్య 15 ఏళ్లుగా రెండెకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి తన పేరిట ఆన్​లైన్​లో నమోదు అయిందంటూ అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు రమణారెడ్డి.. ఆరు నెలలుగా వాదిస్తున్నారు. నాలుగైదు రోజులుగా రమణారెడ్డికి, సిద్ధయ్యకు మధ్య వివాదం తీవ్రమైంది. ఇవాళ ఏకంగా జేసీబీ, ట్రాక్టర్లతో పొలం ఆక్రమణకు వచ్చిన రమణారెడ్డిని.. పొలంలోనే ఉన్న బత్తల సిద్ధయ్య కుటుంబం ఎదిరించింది. సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమిస్తారా అంటూ కారం చల్లి... రాళ్లు, కర్రలతో వెంటబడి తరిమారు. ఈ దాడిలో గాయపడిన వైకాపా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కళ్లల్లో కారం చల్లిన బాధితులు

'దాడి విషయం తెలుసుకున్న వైకాపా నాయకుల అనుచరులు.. మా ఇంటిపై విధ్వంసానికి దిగారు. ఇంట్లో ఉన్న 8 నెలల గర్భవతి అయిన నన్ను బయటికి పంపించి.... లోపల ఉన్న వస్తువులన్నింటినీ పగులగొట్టారు. నీ భర్త అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. మేము 100కు ఫోన్ చేసినా పోలీస్ అధికారులు వెంటనే స్ఫందించలేదు. తనకు, తన భార్తకు పోలీసులు రక్షణ కల్పించాలి. '- సాలమ్మ, బాధితురాలు

గుండాపురం వైకాపా నాయకులపై దాడి చేసిన బత్తల సిద్ధయ్యతోపాటు వారి కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అధికార పార్టీ నేతలపై బాధితులు దాడి చేసిన వెంటనే ప్రతీకారంతో దాడి చేస్తారని పసిగట్టలేని పోలీసులు.. సిద్దయ్య ఇంటిపై విధ్వంసం సృష్టించినా.. అటువైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు పరోక్షంగా అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులెవరూ మీడియాతో మాట్లాడకుండా ఉన్నత స్థాయిలో ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.