ETV Bharat / state

వైకాపాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

author img

By

Published : Nov 13, 2020, 1:02 PM IST

Updated : Nov 13, 2020, 7:47 PM IST

ycp-follower-killed-in-a-clash-occured-between-same-party-at-kadapa
వైకాపా వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి

12:56 November 13

వైకాపా వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి

అక్రమాలను ఎత్తిచూపినందుకు కడప జిల్లాలో అధికార పార్టీకి చెందిన గురునాథ్‌రెడ్డి అనే కార్యకర్త... సొంతపార్టీ నేతల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైకాపాలో తూర్పు-పడమరగా ఉన్న ఇద్దరు పార్టీ ముఖ్యనేతల అనుచరుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటన అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే...

కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురంలో... వైకాపా కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యకు గురయ్యాడు. పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం చేసుకున్న రాళ్లదాడిలో గురునాథ్ రెడ్డి చనిపోయాడు. గండికోట జలాశయ ముంపు పరిహార పంపిణీలో అవకతవకలే హత్యకు ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం కింద ప్రభుత్వమిచ్చే 10 లక్షలను.... కొందరు అనర్హులకూ ఇచ్చారని కొంతకాలంగా విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై... గురునాథ్‌రెడ్డి ఏడాదిగా కలెక్టర్‌, స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేయాలని మరోసారి ఫిర్యాదు చేయడంతో... జీఎన్ఎస్ఎస్ స్పెషల్‌ కలెక్టర్‌ రోహిణి.... శుక్రవారం పి.అనంతపురంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో రమేష్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి వర్గాలుండగా.... రమేష్‌రెడ్డి వర్గీయుల పేర్లు ఉన్నాయని గురునాథ్‌రెడ్డి ఫిర్యాదుతోనే గ్రామసభ నిర్వహించారు. 

సభలో రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఒక్కసారిగా గురునాథ్‌రెడ్డిపై రమేష్‌రెడ్డి వర్గం... రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ గురునాథ్‌రెడ్డిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... రమేష్‌రెడ్డి వర్గీయులు పరారీలో ఉన్నట్టు తెలిపారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఇద్దరు వైకాపా ముఖ్యనేతలకు.... పి.అనంతపురంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైపు.... మరో వర్గం... ఇటీవలే వైకాపాలో చేరిన రామసుబ్బారెడ్డివైపు ఉన్నారు. ప్రస్తుతం దాడిలో మృతి చెందిన గురునాథ్‌రెడ్డి.... రామసుబ్బారెడ్డి వర్గీయుడు. ఏడాది క్రితం... రమేష్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి మధ్య కొండాపురం సమీపంలో స్థలం విషయంలో గొడవ జరిగింది. గురునాథ్‌రెడ్డిపై ఏడాది కిందట దాడి జరగ్గా..... అప్పుడు బయటపడ్డారని స్థానికలు చెబుతున్నారు. ఏడాది నుంచి ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఈ ఘటనపై జమ్మలమడుగు వైకాపా నేతలు ప్రస్తుతానికి స్పందించలేదు.

ఇదీ చదవండి:

 'అంతే లేకుండా దోపిడీ.. అడ్డే లేకుండా అప్పు.. ఇదీ జగన్ పాలన'

Last Updated : Nov 13, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.