ETV Bharat / state

ఉగాది వేడుకల్లో ముస్లింలు.. ఎక్కడంటే..!

author img

By

Published : Mar 22, 2023, 3:31 PM IST

Muslims Ugadi: ఉగాది పండుగను హిందువులు మాత్రమే జరుపుకుంటారు అని అనుకుంటారు చాలా మంది. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే..! ఉగాది పండుగను ముస్లిం ప్రజలు కూడా జరుపుకుంటారు. ఉగాది రోజు దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించటమే కాక.. భగవంతునికి కొబ్బరికాయలను కొట్టి తీర్థ ప్రసాదాలను పుచ్చుకుంటారు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా..? అసలు కథేంటో తెలుసుకుందాం రండి..

Ugadi festival is celebrated by Muslims
ముస్లిం ప్రజల ఉగాది పండుగ సెలబ్రేషన్స్

Muslims celebrates Ugadi festival: తెలుగు వారు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఉగాది. ఇది తెలుగువారి తొలి పండుగ. తెలుగు ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం ఎన్నో పర్వదినాలకు నెలవు. సీతారాముల కల్యాణం, వసంత నవరాత్రులు, హనుమాన్ ఆరాధనతో పాటు మరెన్నో విశిష్టతలను ఈ చైత్ర మాసం కలిగి ఉందని పురాణాలు అంటున్నాయి. తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్ర మాసంలో చేసే దేవతారాధన సకల శుభాలను కలిగిస్తుందని అంటారు.

అయితే తెలుగువారు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది పండుగ హిందువులకు మాత్రమే కాదు. ముస్లింలు కూడా జరుపుకునే ఆనవాయితీ ఉంది. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నారా?.. అవునండీ బాబు..! గత కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆచారం ఇది. కడప నగరంలో ఈ ఆనవాయితీ కనిపిస్తుంది. ఉగాది పండుగ రోజు ముస్లింలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం స్వామివారికి టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అందులో భాగంగా ముస్లింలు కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ముస్లింల బిడ్డ బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామిలో విలీనం కావడంతో ఆమెను తమ బిడ్డగా భావించి ముస్లింలు ఉగాది పండుగ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ముస్లింలు ఉగాది పండుగ రోజు మాత్రమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇది ఏళ్ల నుంచి తరబడి వస్తున్న ఆచారం కావడంతో దీన్ని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు నేటి ముస్లింలు. కుల మతాలకు కడప నగరం అతీతమని అంటారు. అది ఈ రోజు కళ్లారా చూడటం విశేషం. ఉగాది పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన ముస్లింలు స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి వెళ్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.