ETV Bharat / state

30 నుంచి ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Mar 9, 2023, 9:41 PM IST

Sri Ramanavami Brahmotsavam: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, తితిదే అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.

Etv Bharat
Etv Bharat

Sri Ramanavami Brahmotsavam : వైఎస్సార్‌ జిల్లాలో అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 30 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 5న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఒంటిమిట్ట పరిపాలన భవనంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు.

ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్ష..హాజరుకానున్న సీఎం జగన్

సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం జగన్ : ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామనీ జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. రాముల వారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణ వేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తామన్నారు. ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా అధికారులు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మిష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద శ్రీవారి సేవకులను నియమిస్తామన్నారు. గతంలో నిర్వహించిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాల అనుభవాలను గుర్తుంచుకొని ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా ఈ ఏడాది కోదండరామ స్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు.

బ్రహ్మోత్సవాల షెడ్యూల్​ : మార్చి 30 నుంచి ఏప్రిల్ 9 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 30న శ్రీరామనవమి, ఏప్రిల్ 3న హనుమత్సేవం, 4న గరుడ సేవ, 5న కళ్యాణోత్సవము, 6న రథోత్సవము, 7న అశ్వవాహనము, 8న చక్రస్నానం, 9న శ్రీపుష్పయాగం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.