ETV Bharat / state

వైకాపా కంచుకోటపై సైకిల్ నజర్

author img

By

Published : May 22, 2019, 6:00 PM IST

కడప జిల్లా... దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ కంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు. ఈ జిల్లాలో 2009, 2014 ఎన్నికల్లో కేవలం ఒకే సీటుతో సరి పెట్టుకున్న తెదేపా... ఈసారి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని భావిస్తోంది. వైకాపా మాత్రం కంచుకోట పదిలంగానే ఉంటుందనే విశ్వాసంతో ఉంది. పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామనే ధీమా ఆపార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

వైకాపా కంచుకోటపై సైకిల్ నజర్

వైకాపా కంచుకోటపై సైకిల్ నజర్

కడప జిల్లాలో 10అసెంబ్లీ, 2పార్లమెంటు స్థానాలున్నాయి. 2014లో ఎన్నికల్లో వైకాపా 9అసెంబ్లీ స్థానాలను చేజిక్కించుకోగా.... తెదేపా కేవలం రాజంపేటతో సరిపెట్టుకుంది. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలూ వైకాపా ఖాతాలోకే వెళ్లాయి. జిల్లాలో మొత్తం 22లక్షల మంది ఓటర్లున్నారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 77.23 శాతం పోలింగ్ నమోదైంది.

వైఎస్​ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి జగన్ రెండోసారి బరిలో నిలిచారు. 2014లో జగన్ 75వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెదేపా తరపున సతీశ్​కుమార్​రెడ్డి పోటీ చేస్తూ ఓటమి పాలవుతున్నారు. 40 ఏళ్లలో పులివెందుల నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావడంలో వైఎస్ కుటుంబం విఫలమైందనే విమర్శలున్నాయి. తెదేపా సర్కారు రూ.1500 కోట్లు ఖర్చు చేసి పులివెందులకు కృష్ణా జలాలు తీసుకొచ్చింది. దీంతో ఈసారి పులివెందుల రైతులు తెదేపా వెంటే ఉన్నారనే ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

జమ్మలమడుగు నుంచి తెదేపా తరపున మాజీమంత్రి రామసుబ్బారెడ్డి పోటీ చేయగా... వైకాపా నుంచి డాక్టర్.సుధీర్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి కడప జిల్లాలో తెదేపా గెలిచే వాటిలో జమ్మలమడుగు మొదటి స్థానంలో ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. మైదుకూరు నుంచి తెదేపా అభ్యర్థిగా తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్​యాదవ్ పోటీ చేయగా... వైకాపా నుంచి రఘురామిరెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో 10వేల ఓట్లతో ఓటమి చవిచూసిన పుట్టా... ఈసారి తప్పకుండా విజయం వరిస్తుందని ధీమాతో ఉన్నారు. రఘురామిరెడ్డి కూడా అంతే ధీమాతో ఉన్నారు.

కమలాపురం నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి పోటీలో ఉండగా... వైకాపా నుంచి రవీంద్రనాథ్ రెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో 5వేల ఓట్లతో పుత్తా ఓడిపోగా... ఈసారి ఎలాగైనా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీలోనే ఉన్నా... పోలింగ్ రోజు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థిగా లింగారెడ్డి పోటీ చేయగా... వైకాపా తరపున రాచమల్లు ప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. 2014లో ఇక్కడ తెదేపా తరపున వరదరాజులరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తెదేపా సీటు లింగారెడ్డికి దక్కింది. ఇద్దరు నేతలు కలిసిన దరిమిలా విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

కడప నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా అమీర్ బాబు పోటీలో నిలిచారు. వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషా బరిలో ఉన్నారు. కిందటి ఎన్నికల్లో ఇక్కడ తెదేపా-భాజపా పొత్తులో భాగంగా సీటు భాజపాకు కేటాయించినా ఓటమి తప్పలేదు. ఈ సారి తెదేపా అభ్యర్థి అమీర్ బాబు పోటీ చేసినా... పోల్​మేనేజ్​మెంట్ సరిగా చేసుకోలేదనే విమర్శలున్నాయి. బద్వేలు ఎస్సీకి రిజర్వు కావడంతో ఇక్కడ తెదేపా-వైకాపా రెండు పార్టీలు కొత్త అభ్యర్థులనే నిలిపాయి. ఇద్దరూ డాక్టర్లు కావడం విశేషం. తెదేపా తరపున డాక్టర్ రాజశేఖర్, వైకాపా తరపున డాక్టర్ వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. గత ఎన్నికల్లో తెదేపా తరపున విజయజ్యోతి పోటీ చేయగా... వైకాపా తరపున పోటీ చేసిన జయరాములు గెలుపొందారు. తర్వాత ఆయన తెదేపా గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

2014లో రాజంపేట నుంచి తెదేపా తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. అనంతరం ఆయన వైకాపాలో చేరారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేయగా... తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో విజయం ఎవరి వైపు ఉందనే సందిగ్ధం నెలకొంది.

కోడూరు ఎస్సీకి రిజర్వు కావడంతో తెదేపా తరపున చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మేనల్లుడు నరసింహ ప్రసాద్ పోటీ చేశారు. వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కొరముట్ల శ్రీనివాసులు కేవలం 1900 ఓట్లతోనే విజయం సాధించారు. ఈసారి విజయంపై తెదేపా ధీమాగా ఉంది. రాయచోటిలో వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయగా... తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ మైనారిటీ ఓట్లు కీలకం. ముస్లింలు తమవైపే ఉన్నారని తెదేపా బలంగా నమ్ముతోంది.

కడప పార్లమెంటు స్థానానికి తెదేపా అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేయగా... వైకాపా నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి రెండోసారి బరిలో నిలిచారు. ఎన్నికల సమయంలోనే వివేకానందరెడ్డి దారుణహత్యకు గురవడం... అవినాశ్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు రావడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ వివాదాల నేపథ్యంలో కడప ఎంపీ స్థానం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇక రాజంపేట పార్లమెంటు స్థానానికి వైకాపా తరపున మరోసారి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భాజపా-తెదేపా పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తెదేపా తరపున డీకే ఆదికేశవులనాయుడు భార్య సత్యప్రభ పోటీలో ఉన్నారు. మొత్తానికి వైకాపా కంచుకోటను బద్దలు కొడతామని తెదేపా ధీమాతో ఉండగా... పట్టు నిలుపుకుంటామని వైకాపా అంతకంటే ఎక్కువ ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్, భాజపా, జనసేన పార్టీల పోటీ ఇక్కడ నామమాత్రమే అయ్యింది.

ఇదీ చదవండీ...

సీఎం నివాసం వద్ద భద్రత మరింత పటిష్టం

Intro:కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని నెరవాడ గ్రామంలో ట్రైన్ ఢీకొని యువకుడు మృతి చెందాడు


Body:కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని నెరవాడ గ్రామానికి చెందిన జాకీర్ హుస్సేన్ 22 ట్రైన్ ఢీకొని మృతి చెందాడు ఇంటికి బర్రెలు రాలేదని మంగళవారం సాయంత్రం వెతకడానికి వెళ్ళిన జాకీర్ హుస్సేన్ ఉదయం శవమై కనిపించాడు పాణ్యం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.