ETV Bharat / state

సెల్ ఫోన్ పోయిందా..? 476 సెల్‌ఫోన్లు అందజేసిన పోలీసులు.. ఎక్కడంటే?

author img

By

Published : Mar 23, 2023, 10:23 PM IST

Kadapa district
Kadapa district

Kadapa district Police caught 476 missing mobiles: ఆంధ్రప్రదేశ్‌లో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానం సత్ఫలితాలు ఇస్తోంది. వైయస్సార్ జిల్లా ఎస్పీ అంబురాజన్.. రికవరీ చేసిన దాదాపు రూ.1.30కోట్ల విలువ చేసే 476 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. మొబైల్ ట్రాకింగ్ పై జిల్లా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, సెల్‌ఫోన్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా ఫిర్యాదు చేస్తే రికవరీ చేస్తామని తెలిపారు.

Kadapa district Police caught 476 missing mobiles: ప్రస్తుత రోజుల్లో సెల్‍‌ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. అయితే, వివిధ కారణాల చేత సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న, చోరికి గురైన బాధితులు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులు భరోసానిస్తున్నారు. సెల్‌ఫోన్లు తప్పిపోయిన వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే, దాని ఆచూకీని కనిపెట్టి బాధితులకు అందజేస్తామని చెబుతున్నారు. మరీ ఎలా ఆ సెల్‌ఫోన్లను కనిపెడతారు..?, ఏ విధంగా రికవరీ చేస్తారు?, ఏదైనా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారా..?,సెల్‌ఫోన్ మిస్సైన తర్వాత ఎన్ని రోజులకు ఫిర్యాదు చేయాలి..? అనే తదితర వివరాలను వైయస్సార్ జిల్లా ఎస్పీ అంబురాజన్ మీడియా ముఖంగా వెల్లడించారు.

మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానం: వివరాల్లోకి వెళ్తే.. వైయస్సార్ జిల్లాలో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానం మంచి సత్ఫలితాలను ఇస్తుందని.. జిల్లా ఎస్పీ అంబురాజన్ తెలిపారు. కొన్ని ఏళ్ల తరబడి చోరీకి గురవుతున్న సెల్‌ఫోన్‌లను 'మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానం' ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో రూ. కోటి 30 లక్షలు విలువ చేసే 476 సెల్ ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అందజేశామన్నారు. తాజాగా మూడో విడతలో రికవరీ చేసిన 215 సెల్‌ఫోన్లను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.

సెల్‌ఫోన్ రసీదులు తప్పనిసరి: ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ''వివిధ కారణాలతో బాధితులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల వివరాలను, వాటికి సంబంధించిన రసీదులను 9392941541 నెంబర్‌కు వాట్సాప్ చేస్తే.. ఆ ఆధారాల ప్రకారం.. సైబర్ క్రైమ్ పోలీసులు మిస్సింగ్ మొబైల్ ఛార్జింగ్ విధానం ద్వారా చరవాణిని ఎక్కడుందో గుర్తిస్తారు. చరవాణి ఏ రాష్ట్రంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉందని తెలిసినా వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి వాటిని రికవరీ చేస్తారు. ఇప్పటివరకు వైయస్సార్ జిల్లా వ్యాప్తంగా 3,600 సెల్‌ఫోన్లు వివిధ కారణాలతో పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. వాటిలో పనిచేస్తున్న 476 సెల్‌ఫోన్లను గుర్తించి.. రికవరీ చేశాం. మొదటి విడతలో 130 సెల్‌ఫోన్లు, రెండో విడతలో 131 సెల్‌ఫోన్లు, ఇప్పుడు (మూడో విడత) 215 సెల్‌ఫోన్లు రికవరీ చేసి, బాధితులకు అందజేశాము.'' అని ఎస్పీ అంబురాజన్ అన్నారు.

ఇలా ఫిర్యాదు చేయాలి: సెల్‌ఫోన్లు పోయిన 15 రోజుల తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. అంతేకాకుండా, సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్లు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని తెలిపారు. అలా రసీదు తీసుకోకపోతే.. అవి కచ్చితంగా దొంగ సెల్‌ఫోన్లుగా అనుమానించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని సెల్‌ఫోన్ల కోసం గాలిస్తున్నామని.. వాటిని కూడా త్వరలోనే రికవరీ చేసి బాధ్యతలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా బాధితులు తమ సెల్‌ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం సెల్‌ఫోన్ల రికవరీలో కృషి చేసిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.