ETV Bharat / state

ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను.. యథేచ్ఛగా కబ్జాలు

author img

By

Published : Jan 12, 2021, 2:10 PM IST

ఈ భూమి మాదే.. ఈ నేల మాదే.. ఈ కొండ మా వాళ్లదే అంటూ అడ్డగోలుగా భూ అక్రమార్కుల కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆక్రమణలపై చర్యలు ఉపక్రమించేందుకు ప్రయత్నిస్తున్న రెవెన్యూశాఖ అధికారులపై నిమిషాల వ్యవధిలో కీలక నేతల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో.. చేసేదిలేక వెనకడుగు వేస్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా భూబకాసురుల కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములు కనిపిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Occupy government lands
ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

ఒంటిమిట్ట మండలంలో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని తెలిస్తే చాలు అక్రమార్కుల దురాక్రమణకు గురవుతోంది. వాగులు, వంక పోరంబోకు, కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా కబ్జాకు తెగబడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి హక్కులు లేకపోయినా అధికారులను మచ్చిక చేసుకుని కావాల్సినంత రాయించుకుని అనుభవిస్తున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమించినట్లు అనువంశీకం, పిత్రార్జితం పేరిట రెవెన్యూశాఖ యంత్రాంగం నుంచి పత్రాలు పొందుతున్నారు. ఈ తతంగం గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నా ఎవరూ అడ్డుకోవడం లేదు సరికదా.. అక్రమమని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

మండలంలోని మంగంపేటలో నియోజకవర్గస్థాయిలోని ఓ ముఖ్య నేతకు చెందిన ప్రధాన అనుచరుడు అక్రమంగా అయిదెకరాలు కబ్జాకు పాల్పడ్డారు. ఇక్కడే మరో స్థానికేతర ముఖ్య నాయకుడి కుటుంబసభ్యులు, బంధువుల పేరిట 14.70 ఎకరాలను ఆక్రమించుకున్నారు. పెద్దల నుంచి సంక్రమించిన భూములు కాదు. వీరందరూ అధికారులను ప్రసన్నం చేసుకుని అడ్డదారిలో భూములను పొంది ఏకంగా బేరం పెట్టి సుమారు రూ.15 లక్షలకుపైగా సొమ్ము చేసుకున్నారు. ఇదంతా తమకేమి తెలియనట్లు అధికారులు ఉండడం విమర్శలకు తావిస్తోంది. కడప-రేణిగుంట జాతీయ రహదారి పక్కన సర్వే నంబరు 20లో 2.52 ఎకరాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని స్థానికంగా రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే చదును చేయగా, వివాదాస్పదం కావడంతో రెవెన్యూ అధికార యంత్రాంగం హెచ్చరిక సూచిక ఏర్పాటు చేయడంతో తాత్కాలికంగా ఆక్రమణలు నిలిచాయి.

ఒంటిమిట్ట మండలం మారుమూల గ్రామం పట్రపల్లి శివారులో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో సర్వే నంబరు 451లో 3.80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొంత మంది నాయకుల అండతో చెరువు పక్కనే రెండెకరాలకు పైగా ఆక్రమించారు. ఇక్కడ సాగిన భూ దందాపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగలేదు.

ఒంటిమిట్ట మండలం మంగంపేటలో కడప-రేణిగుంట జాతీయ రహదారికి అతి సమీపంలో సర్వే సంఖ్య 83లో 81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరు కీలక ఉద్యోగుల కుటుంబ సభ్యులు భూ దందాకు తెరలేపారు. కొండలను పిండి చేసి గుట్టలను తొలగించి యంత్రాలతో చదును చేయించారు. నాలుగు ఎకరాలకుపైగా ఆక్రమించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి విస్తుపోయారు. పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అనంతరం బడా నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో చర్యలకు ఉపక్రమించలేదు. స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్‌ను సైతం అధికారులు వదిలేశారు.

జౌకులపల్లిని మింగేసిన అనకొండలు

మారుమూల గ్రామం జౌకులపల్లిలోని భూములను కొంతమంది నాయకులు మింగేశారు. భూమాఫియా చేతుల్లో ఎకరాలకొద్దీ ఉన్నా స్వాధీనంపై అధికారులు సాహసం చేయడం లేదు. ఇక్కడ దవళం దొరలు ఎక్కువగా పాగా వేశారు. గతంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సర్వే చేసి కబ్జా బాగోతాన్ని నిగ్గు తేల్చారు. చర్యలు తీసుకునే సమయంలో అధికారులపై బదిలీ వేటు పడింది. అటవీ శాఖకు చెందిన భూమి సైతం కబ్జాకు గురవ్వడమే కాకుండా పంటలు సైతం సాగవుతున్నాయి. రెవెన్యూశాఖ నుంచి అటవీశాఖకు బదలాయించిన 142.94 ఎకరాలు 33 మంది చేతుల్లో చిక్కుకోగా, రెవెన్యూ పరిధిలోని 82.65 ఎకరాలను 23 మంది హస్తగతం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన పెద్దలు ఆక్రమణదారుల జాబితాలో ఉండగా, అధికారులు కేవలం తాఖీదులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.

ఊరూరా భూమాయ...

కోనరాజుపల్లెలో మూడెకరాల్లోని వాగు పోరంబోకును సైతం ముగ్గురు ఆక్రమార్కులు విడిచిపెట్టలేదు. గుంటికాడిపల్లెలో సర్వే నంబరు 191లో అయిదెకరాల ప్రభుత్వ భూమిలో ఇద్దరు అక్రమార్కులు యంత్రాలతో చదును చేస్తున్నారు. మలకాటిపల్లెలో ఎకరా విస్తీర్ణంలో ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి చదును చేశారు. కొత్తమాధవరం సమీపంలో అధికార యంత్రాంగానికి అనుకూలమైన ఇద్దరికి ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా రాసిచ్చారు. పెన్నపేరూరులోనూ ఇష్టారాజ్యంగా సుమారు 50 ఎకరాలకుపైగా అసైన్డు భూములు అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. రాచగుడిపల్లెలోనూ సుమారు 20 ఎకరాల్లోని డీకేటీ భూముల క్రయవిక్రయాలు సాగుతున్నా ఇదేమని అడిగే వారులేరు. మంటపంపల్లెలో 2, 336 సర్వే నంబర్లలో మొత్తం 13 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిని అడ్డదారిలో కాజేసేందుకు ఓ ముఖ్య నాయకుడు పైరవీలు చేస్తున్నారు.

ప్రభుత్వ భూమి దురాక్రమణ

శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఆలయ రహదారిని కూడా కబ్జా చేయాలని యత్నిస్తున్నారు. - బొడ్డే సుబ్బానాయుడు, ఆలయ కమిటీ ఛైర్మన్‌, శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, పట్రపల్లి

ఆక్రమణల అడ్డుకట్టకు చర్యలు

భూఆక్రమణల విషయం మా దృష్టికి వచ్చింది. ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నాం. హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేస్తున్నాం. ఆక్రమణల అడ్డుకట్టకు కఠిన చర్యలు తీసుకుంటాం. - పి.విజయకుమారి, తహసీల్దారు, ఒంటిమిట్ట

ఇవీ చూడండి...

'యువతకు నైపుణాభివృద్ధి శిక్షణ ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.