ETV Bharat / state

కడప జిల్లా కొప్పర్తిలో ఈఎంసీ.. 730 కోట్ల వ్యయంతో నిర్మాణాలు!

author img

By

Published : Aug 20, 2020, 5:20 AM IST

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలో ఈఎంసీ(ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా పారిశ్రామికవాడలో... 730 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం జగన్‌ నిర్ణయం మేరకు ఏపీఐఐసీ సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

కొప్పర్తిలో ఈఎంసీ..రూ. 730 కోట్ల వ్యయంతో నిర్మాణాలు!
కొప్పర్తిలో ఈఎంసీ..రూ. 730 కోట్ల వ్యయంతో నిర్మాణాలు!

కడప జిల్లా కొప్పర్తి మెగా పారిశ్రామికవాడలో ఈఎంసీ నెలకొల్పాలన్న సీఎం జగన్‌ నిర్ణయానికి అనుగుణంగా... దాదాపు 7 వేల ఎకరాలను ఏపీఐఐసీ సేకరించింది. పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన 15 వందల ఎకరాలు... పరిశ్రమలు పెట్టాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం సిద్ధంగా ఉంది. దీంట్లో 800 ఎకరాలను ఈఎంసీ కోసం కేటాయించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో రెండు ఈఎంసీలు ఉండగా... కొప్పర్తిలో మూడో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 730 కోట్ల రూపాయల వ్యయంతో... వచ్చే 6 నెలల నుంచి ఏడాదిలోగా దీని పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. 730 కోట్ల రూపాయలతో వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ఈఎంసీ-3 పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులు ప్రారంభించారు.

క్లస్టర్‌ నిర్మాణ ఖర్చుల్లో 70 శాతాన్ని కేంద్రం భరించనుండగా... మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ భరిస్తాయి. 800 ఎకరాల్లో పలు ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు... ఆధునికమైన భారీ షెడ్లను ఏపీఐఐసీ ఏర్పాటు చేయనుంది. రహదారులు, నీటివసతి, మౌలికవసతుల కల్పనకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. డిజైన్‌ రూపకల్పనకు ఓ ప్రైవేటు సంస్థకు సంప్రదింపుల బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. ఆరు నుంచి పది భారీ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థలు నెలకొల్పే విధంగా లేఅవుట్ సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఈఎంసీ ప్రాథమిక పనులు పూర్తయితే... ఫాక్స్ కాన్, శ్యాంసంగ్, విస్ట్రన్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ యూనిట్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయని ఏపీఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆరు సంస్థలతో ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్లస్టర్‌ పూర్తయ్యేలోగా ఒప్పందాలు చేసుకునేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కేబినెట్‌ ఆమోదంతో... పనులు వేగంగా పూర్తయి పెట్టుబడులు వస్తాయని, కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.