ETV Bharat / state

ప్రభుత్వం సరెండర్ చేసిందన్న కోపం.. కిందిస్థాయి పశువైద్యులపై ప్రతాపం..

author img

By

Published : Mar 4, 2023, 10:11 AM IST

govet officer
పశువైద్యులు

Protests against the behavior of the officer : ప్రభుత్వం సరెండర్ చేసిందన్న కోపాన్ని కింది స్థాయి పశువైద్యులపై చూపించారు ఓ ఉన్నతాధికారి. ఈ ఘటనలో బాధిత ఉద్యోగులు ఆ అధికారి తీరుని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఒకపక్క ఏపీలో యావత్తు ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, పింఛన్ దారుల జీతాలు సకాలంలో రాకపోవడంతో కొన్ని నెలలుగా ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కడపలో మాత్రం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న తమ జీతాలకు సంబంధించి బిల్లులపై సంతకాలు చేయకపోవడంపై ఆగ్రహంతో వైద్యులు నిరసనలకు దిగారు.

Protests against the behavior of the officer : 'ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి" అన్న నానుడిగా కడప పశువైద్యశాల ఉద్యోగుల జీతాలు రావడం లేదని ఆందోళనకు దిగారు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్నకు పశువైద్యులకు మధ్య తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది.

అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు..: పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్నను ప్రభుత్వం సరెండర్ చేయడంతో ఆ కోపంతో ఆయన వైద్యుల జీతాలు నిలపడం గమనార్హం. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తమ జీతాలు ఆపడం ఏమిటని వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపధ్యంలో గత మూడు నాలుగు నెలల నుంచి వైద్యులకు జీతాలు రాకపోవడంతో పశు వైద్యశాల జిల్లా అధికారి శారదమ్మ చాంబర్ లో బైఠాయించారు. జీతాలు చెల్లించాలంటూ న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

మళ్ళీ మొదటికొచ్చిన సమస్య..: కడప పశువైద్యశాలలో సమసిపోయిందనుకున్న సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న వైద్యుల జీతాలకు సంబంధించి బిల్లులపై సంతకాలు చేయకపోవడంతో వివాదానికి దారితీసింది. గత మూడు నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఇవాళ వారు పశు వైద్యశాల జిల్లా అధికారి శారదమ్మ చాంబర్ లో వైద్యులు బైఠాయించారు. జీతాలు చెల్లించాలంటూ న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఆమె ఛాంబర్ లో బైఠాయించి నిరసన తెలియజేశారు.

ఆరుమాసాలుగా రగులుతున్న వివాదం..: జిల్లా అధికారి శారదమ్మ రాష్ట్ర డైరెక్టర్ తో చరవాణిలో సంప్రదించారు. వాస్తవానికి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్నకు వైద్యులకు గత ఆరు మాసాల నుంచి వివాదం కొనసాగుతోంది. అచ్చన్నను ప్రభుత్వం సరెండర్ చేయగా అతను కోర్టుకు వెళ్లి తిరిగి కడపలోనే పోస్టింగ్ తెచ్చుకున్నారు. అంతటితో ఊరుకోక తన కింద విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో నాలుగు నెలల నుంచి జీతాలు ఆపడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని వైద్యులు ఆవేదన చెందుతున్నారు.

కమిటీ ఏం చెప్పిందంటే..: అచ్చన్నను 10 రోజుల కిందట త్రిష కమిటీ సభ్యులు విచారించారు. అతనిపై నివేదికను తయారుచేసి ఉన్నత స్థాయి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ చర్యకు ప్రతిచర్యగా అచ్చన్న కిందిస్థాయి సిబ్బందికి జీతాల బిల్లులపై సంతకాలు పెట్టక తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా పశువైద్యులకు జీతాలు మంజూరు కాలేదు. ఈ విషయంపై జిల్లాలోని పశు వైద్య డాక్టర్లందరూ జిల్లా అధికారి ఛాంబర్ లో బైఠాయింపుకు దారితీసింది. తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అచ్చన్నపై ఉన్నతస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే రేపటి నుంచి పూర్తిస్థాయిలో విధులను బహిష్కరిస్తామని ఉద్యోగ సంఘం నాయకులు హెచ్చరించారు.

అధికారి అక్కసు దిక్కుతోచని వైద్యులు..:

'కింద ఉన్న ఇద్దరు ఏడీలను, ఈడీని, ఇద్దరు అటెండర్లను సరెండర్ చేసి వేధింపులకు గురి చేయడం బాధాకరం. ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరించడంతో దిక్కుతోచని స్థితి. కలెక్టర్, ఎస్పీ లకు అనేకసార్లు విన్నవించుకున్నా ఫలితం దక్కలేదు. అధికారి కోర్టు నుంచి పోస్టు తెచ్చుకుంటానని కిందిస్థాయి ఉద్యోగులనే బెదిరిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనాల ఫైలుపై సంతక చేయడం లేదు. నిజనిర్థారణ కమిటీ నివేదికతోనూ సానుకూలత లేదు. గతంలో పెన్ డౌన్ ఆందోళన తలపెట్టినా అధికారుల నుంచి స్పందన లేదు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న పై ఉన్నతాధికారులు తగిన చర్య తీసుకోకపోతే మళ్లీ పెన్ డౌన్ సమ్మె , వాక్సినేషన్ ఇతర విధులను నిర్వహించం.’ - నేతాజీ , కడప జిల్లా పశు వైద్యాధికారుల సంఘం అధ్యక్షులు

సరెండర్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలి..:

'పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న తన కింది స్థాయి ఉద్యోగులను సరెండర్ చేయడం అన్యాయం. జీతాలు రాక ఆందోళన చెందుతున్న వైద్యుల నిరసనకు సంఘీభావం తెలుపుతున్నాను. వారి ఆందోళనలో పాలుపంచుకుంటున్నాను. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు వాస్తవాలను గమనించి సరెండర్ చేసిన ఉద్యోగులను తిరిగి విధులు నిర్వహించుకునేలా అనుమతులివ్వాలి. నిలిచిపోయిన జీతలను చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలి’’ - శారదమ్మ, జిల్లా పశు వైద్యశాల జిల్లా అధికారి

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.