ETV Bharat / state

KIDNAP: ప్రేమ పేరుతో వంచించాడు.. నిలదీసినందుకు కిడ్నాప్ చేశాడు!

author img

By

Published : Jul 7, 2021, 5:33 PM IST

ప్రేమించిన యువతిని నిర్బంధించిన ప్రియుడు.
ప్రేమించిన యువతిని నిర్బంధించిన ప్రియుడు.

ప్రేమించిన యువతిని.. ప్రియుడు నిర్భంధించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా నవుడూరులో జరిగింది. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమించాడు. జీవితాన్ని పంచుకుంటానని మాటిచ్చాడు. కరోనాతో దొరికిన గ్యాప్ ను వాడుకుని.. ఎస్కేప్ అయ్యాడు. సొంతూరుకు చేరుకుని.. హాయిగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన అతడి ప్రేమికురాలు.. భరించలేకపోయింది. అతని ఊరికి వెళ్లింది. ఎందుకిలా చేశావని నిలదీసింది. అతడిని వదిలి ఉండలేనని తేల్చి చెప్పింది. ఆ సమయంలో.. ఆమె ప్రేమికుడి అసలు స్వరూపం మరోసారి బయటపడింది. అక్కడికక్కడే యువతిని నిర్బంధించిన సదరు ఫేక్ ప్రేమికుడు.. డ్రామా చేశాడు. చివరికి.. విషయం బట్టబయలై.. పోలీసు కేసులో ఇరుక్కున్నాడు.

ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది!

బెంగళూరు టు వెస్ట్ గోదావరి. అక్కడ మొదలైన ప్రేమకథ.. చివరికి గోదారి గట్టున మోసపూరితమని తేలిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన రమేష్.. కర్ణాటక రాజధాని బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసేవాడు. అక్కడే ఓ యువతిని ప్రేమించాడు. కరోనా వ్యాప్తితో బెంగళూరులో ఉండలేని పరిస్థితుల్లో.. తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అనంతరం.. ఏం జరిగిందో కానీ.. తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రమేష్ వ్యవహారం.. బెంగళూరులో ఉన్న ప్రేమికురాలికి తెలిసింది. అక్కడి నుంచి ఈ నెల 4న ఆమె ప్రియుడి ఇంటిని వెతుక్కుంటూ.. నవుడూరుకు చేరింది. తనను మోసం చేసినందుకు రమేష్ తో పాటు.. అతని తల్లిదండ్రులనూ నిలదీసింది.

రాజీ యత్నం విఫలమై... కిడ్నాప్!

తన ప్రేమికురాలు ఇంత పట్టుబడుతుందని ఊహించని రమేష్.. చివరికి ఆమెను అనూహ్యంగా నిర్బంధించాడు. తన సన్నిహితుల సహాయంతో ఆమెను అక్కడే చెరబట్టాడు. ఆ నోటా ఈ నోటా.. ఈ విషయం బయటకు వచ్చింది. స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్.. తన స్నేహితుడి సహాయం తీసుకుని.. ఆ అమ్మాయిని మరో ప్రాంతానికి తరలించాడు. అక్కడి నుంచి ఆమెను బయటకు వెళ్లకుండా నిర్బంధించాడు. మానసికంగా హింసించాడు. బెదిరించాడు. తాను బెంగళూరు వెళ్లిపోయినట్టుగా.. ఆ అమ్మాయితోనే ఫోన్లో పోలీసులకు చెప్పించి.. వారిని తప్పుదోవ పట్టించాడు.

చివరికి...

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసులు... బెంగళూరు నుంచి వచ్చిన యువతి ఇంకా రమేష్ చెరలోనే ఉందని తెలుసుకున్నారు. నిర్బంధం నుంచి కాపాడారు. ప్రేమ పేరుతో నమ్మించి.. చివరికి తన కోసం వచ్చిన యువతిని ఇంతగా హింసించిన రమేష్ తో పాటు.. ఈ కిడ్నాప్ వ్యవహారానికి సహకరించిన అతని స్నేహితుడిపై.. రమేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలంటూ యువతి ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.