ETV Bharat / state

పోలవరం డీపీఆర్‌ 2 ఆమోదం ఎంతకు?

author img

By

Published : Oct 23, 2020, 7:18 AM IST

పోలవరం రెండో డీపీఆర్ ఎంత మొత్తానికి ఆమోదం పొందిందనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2013-14 ధరలను ఆమోదించారా, లేక 2017-18 అంచనాలపై కేంద్ర జలశక్తి మంత్రి సంతకం పెట్టారా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. పోలవరం ప్రాజెక్టు వ్యయం ప్రతిపాదనలపై కేంద్రం రాసిన లేఖ.... అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Polavaram project
పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు వ్యయం ప్రతిపాదనలను ఆమోదించి పంపాలంటూ పోలవరం అథారిటీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. 2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం రూ.20,389.61 కోట్లకే డీపీఆర్‌-2 ఆమోదిస్తున్నట్లు ఆర్థికశాఖ రాసిన లేఖను యథాతథంగా ప్రాజెక్టు అథారిటీకి పంపింది. దీనికి ఆమోదం తెలపాలని తొలుత కేంద్ర జలశక్తి శాఖను ఆర్థికశాఖ కోరింది. దీన్నే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదించి పంపాలని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. తక్షణమే ఈ పని చేయాలనీ ఆ లేఖలో కోరారు. ఆ లేఖ ప్రతిని ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సైతం పంపారు. దీంతో కేంద్రం నుంచి ఇంకా దాదాపు రూ.30వేల కోట్లు వస్తాయని ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. ఇక తాము రూ.7,053 కోట్లే ఇస్తామని కేంద్రం అధికారికంగా చెప్పడంతో ‘పోలవరం’లో కలకలం రేగింది. రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ దిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖతో గురువారం చర్చలు మొదలుపెట్టారు. వెంటనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన అథారిటీ ఛైర్మన్‌, సీఈవోలను కోరారు. త్వరలోనే పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా కేంద్ర ఆర్థిక మంత్రిని, జలశక్తి శాఖ మంత్రిని ఈ విషయమై కలిసే అవకాశం ఉంది.

పోలవరం ప్రాజెక్టుకు ఆర్‌సీసీ (రివైజ్డు కాస్ట్‌ కమిటీ- అంచనాల సవరణ కమిటీ) రూ.47,725.74 కోట్లతో డీపీఆర్‌-2ను ఆమోదించిందని, కేంద్ర జలశక్తి మంత్రి కూడా అదే మొత్తానికి ఆమోదం తెలియజేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారని ఇన్నాళ్లూ రాష్ట్రం చెబుతోంది. ఇప్పుడు కేంద్రం రాసిన లేఖ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆ లేఖలో ఇలా ఉంది. ‘‘కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన అంచనాల సవరణ కమిటీ పోలవరం ప్రాజెక్టులో సాగునీటి విభాగానికయ్యే ఖర్చును మదించింది. 2014 ఏప్రిల్‌ 1 నాటికి 2013-14 ధరల ప్రకారం ఖర్చును రూ.20,398.61 కోట్లుగా అంచనా వేసింది. అంతే మొత్తానికి కేంద్ర జలశక్తి మంత్రి ఆమోదమూ లభించింది’’ కేంద్ర ఆర్థికశాఖ ఉప కార్యదర్శి ఎల్‌.కె.త్రివేది కేంద్ర జలశక్తి కార్యదర్శికి ఈనెల 12న పంపిన లేఖలో ఈ విషయం స్పష్టంగా ఉంది. 1.4.2014కు ముందు కేంద్రం నీటిపారుదల విభాగానికి అయిన ఖర్చు కింద రూ.4,730 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంటూ ఇక మిగిలింది రూ.15,667 కోట్లుగా లెక్కించింది. అందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.8614.16 కోట్లు ఇవ్వడంతో ఇక పోలవరానికి కేంద్రం రూ.7053.74 కోట్లే ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఈ అంకెలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదించినట్లుగా భావిస్తున్నామంటూ, ఈ అంశాలను కేంద్ర జలశక్తి శాఖ ఖరారు చేయాలని కూడా ఆర్థికశాఖ సూచించింది.

నాడు నెలల కొద్దీ కసరత్తు

పోలవరం ప్రాజెక్టు రెండో డీపీఆర్‌ ఆమోదానికి సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం అంత సులభంగా లభించలేదు. అప్పట్లో అనేక అభ్యంతరాలు లేవనెత్తగా దాదాపు నెల్లాళ్లపాటు అధికారులు దిల్లీలోనే ఉండి వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది. కిలోలకొద్దీ డాక్యుమెంట్లు రైలులో తీసుకువెళ్లి అందించారు. అన్ని స్థాయిల్లో ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పి రావాల్సి వచ్చింది. టీఏసీ సుమారు రూ.55వేల కోట్లకు ఆమోదించింది. టీఏసీ ఆమోదంతో ఇక డీపీఆర్‌-2 అంతే మొత్తానికి ఆమోదం పొందుతుందని భావించారు. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి రివైజ్డు కాస్ట్‌ కమిటీని ఏర్పాటుచేయగా వారు 2 రకాలుగా మదింపుచేసి రెండింటీకీ ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖకు పంపడమే సమస్య సృష్టించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్థాయిలోనే 2017-18 అంచనాలకు సిఫార్సు చేయించుకోలేకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఎదురైందా.. అన్న చర్చ సాగుతోంది.

మంత్రి ఆమోదం ఎంతకు?

కేంద్ర జలశక్తి మంత్రి కూడా డీపీఆర్‌-2ను రూ.20,398.61 కోట్లకే ఆమోదించారా? అదే నిజమైతే ఇన్నాళ్లూ రాష్ట్రం ఏం చేస్తోందనే ప్రశ్న వినిపిస్తోంది. అప్పుడే మేల్కొంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు కదా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే అంచనాల సవరణ కమిటీ 1.4.2014 నాటికి 2013-14 ధరలకు, 2017-18 ధరలకు కూడా వ్యయం మదింపు చేసిందని, అవే మొత్తాలకు అంచనాల సవరణ కమిటీ, కేంద్ర జలశక్తి మంత్రి రెండింటికీ ఆమోదం తెలియజేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారని ఏపీ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆర్థికశాఖ 2013-14 ధరలను పరిగణనలోకి తీసుకుందని వారు చెబుతున్నారు. 2017లో కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన నోట్‌ ఆధారంగా ఇలా చేశారని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఏనుగుల చెరువు స్వభావాన్ని మార్చొద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.